Viral Video: విద్యుత్ స్తంభంపైనే సీపీఆర్.. ప్రాణాలకు తెగించి కార్మికుడిని కాపాడిన రియల్ హీరో!
Viral Video: అనంతపురం జిల్లా కంబదూరులో విద్యుత్ షాక్‌కు గురై స్తంభంపైనే స్పృహ కోల్పోయిన కార్మికుడికి, ఓ వ్యక్తి సాహసోపేతంగా స్తంభంపైకి ఎక్కి సీపీఆర్ (CPR) చేసి ప్రాణాలు కాపాడాడు.
Viral Video: విద్యుత్ స్తంభంపైనే సీపీఆర్.. ప్రాణాలకు తెగించి కార్మికుడిని కాపాడిన రియల్ హీరో!
Viral Video: అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో ఒళ్లు గగుర్పొడిచే సాహసోపేత ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తూ కరెంట్ షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ కార్మికుడికి, ఓ వ్యక్తి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్తంభంపైనే సీపీఆర్ (CPR) చేసి ప్రాణాలు కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కంబదూరు మండల కేంద్రానికి చెందిన రాజు అనే ప్రైవేట్ విద్యుత్ కార్మికుడు మరమ్మతుల నిమిత్తం విద్యుత్ స్తంభం ఎక్కాడు. పనులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో స్పృహ కోల్పోయి, స్తంభంపై తీగల మధ్యే వేలాడుతూ ఉండిపోయాడు. కింద ఉన్న స్థానికులు ఏం చేయాలో తోచక భయాందోళనకు గురయ్యారు.
అయితే, అక్కడే ఉన్న ఓ వ్యక్తి అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి, వేగంగా స్తంభంపైకి ఎక్కాడు. అంత ఎత్తులో వేలాడుతున్న రాజుకు అక్కడే సీపీఆర్ చేయడం ప్రారంభించాడు. అతని ప్రయత్నం ఫలించి కొద్దిసేపటికే రాజులో కదలిక వచ్చింది. అనంతరం స్థానికుల సహాయంతో రాజును సురక్షితంగా కిందకు దించి, మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదకర పరిస్థితుల్లో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తోటి మనిషి ప్రాణాలు కాపాడిన ఆ వ్యక్తి ధైర్యసాహసాలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.




