Civic Sense India : చార్జింగ్ స్టేషన్.. చెత్త కలెక్షన్ సెంటర్‌గా మార్చిన ఘనులు
Civic Sense India : హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకుల సౌకర్యం కోసం మనాలిలో ఎంతో ముచ్చటపడి ఒక కొత్త ఫోన్ చార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది.
Manali-charging-station
Civic Sense India : హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకుల సౌకర్యం కోసం మనాలిలో ఎంతో ముచ్చటపడి ఒక కొత్త ఫోన్ చార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. పర్యాటకులు తమ గ్యాడ్జెట్లను చార్జ్ చేసుకుంటూ హాయిగా ప్రకృతిని ఆస్వాదిస్తారని ప్రభుత్వం భావించి ఉంటుంది. కానీ మన 'అతి తెలివి' గల పర్యాటకులు మాత్రం దాన్ని చార్జింగ్ పాయింట్‌గా కాకుండా, అత్యంత ఖరీదైన 'డస్ట్ బిన్'గా మార్చేశారు. అది పెట్టిన కొద్ది గంటల్లోనే ఫోన్ల చార్జింగ్ కంటే, తిన్న తిండి తాలూకూ చెత్తతో నిండిపోయి దర్శనమివ్వడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ వింతను చూసిన నిఖిల్ సైనీ అనే నెటిజన్ ఎక్స్‌లో (ట్విట్టర్) అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల పట్ల ప్రజలకు ఎంత గౌరవం ఉందో ఈ ఘటన నిరూపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
టెక్నాలజీ పెరిగి బుద్ది మారడం
దేశంలో ఎన్ని స్వచ్ఛ భారత్ పథకాలు వచ్చినా మన బుద్ధి మారదని, ఇలాంటి వారికి 'ఐరన్ ఫిస్ట్' (కఠినమైన శిక్షలు) ఉంటేనే దారిలోకి వస్తారని ఆయన ఘాటుగా విమర్శించారు. నిజమే మరి, చార్జింగ్ వైర్లు ఉండాల్సిన చోట చిప్స్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ కవర్లు ఉంటే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవ్వగానే నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "డస్ట్ బిన్ లేకపోతే చెత్తను తమ దగ్గరే ఉంచుకుని సరైన చోట పారేయాలి కానీ, ఇలాంటి పనులు చేయడం ఏంటి?" అని కొందరు ప్రశ్నిస్తున్నారు. రోడ్ల నిండా డస్ట్ బిన్లు పెట్టినా ప్రయోజనం ఉండదని, ముందు మనుషుల మైండ్ సెట్ మారాలని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు చేసే వారిని గుర్తించి, వారి ఇంట్లోనే ఆ చెత్తను పారేస్తే బుద్ధి వస్తుందనే ఆవేదన కూడా వ్యక్తమవుతోంది.
నెట్టింట వైరల్ వీడియోలు
అయితే కొందరు మాత్రం దీనికి భిన్నమైన లాజిక్ తీస్తున్నారు. అక్కడ తగినన్ని డస్ట్ బిన్లు లేకపోవడం వల్లే ప్రజలు ఆ చార్జింగ్ పాయింట్‌ను చెత్త కుప్పగా మార్చారని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే, డస్ట్ బిన్ కనిపించకపోతే పక్కనే ఉన్న ఏదో ఒక ప్రభుత్వ ఆస్తిని చెత్తబుట్టగా మార్చే హక్కు తమకు ఉన్నట్లుగా వారు భావిస్తున్నారన్నమాట. జన సాంద్రత ఎక్కువ ఉన్నప్పుడు చెత్త పేరుకుపోవడం సహజమే అయినా, కనీస పౌర స్పృహ లేకపోవడం దారుణమని మరికొందరు వాదిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి సౌకర్యాలు కల్పించినా, ప్రజల మద్దతు లేకపోతే అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పౌర స్పృహ (Civic Sense) లేని సమాజంలో ప్రజా ధనం ఇలాగే వృథా అవుతూ ఉంటుంది.
ఫోన్లు చార్జ్ చేసుకోవడానికి ఇచ్చిన సదుపాయాన్ని చూసి, అందులో చెత్తను చార్జ్ చేస్తున్న ఈ 'మేధావుల' తీరు దేశ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్నే ఉంచుతోంది. చివరగా చెప్పేదేంటంటే, మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత అని గ్రహించనంత వరకు ఏ పథకం మనల్ని మార్చలేదు. ప్రభుత్వం ఏమైనా కొత్తగా చేస్తే, దాన్ని నాశనం చేయడమే మన పని అన్నట్లుగా ప్రవర్తించడం సభ్య సమాజానికి మంచిది కాదు. మనాలి వెళ్లినప్పుడు మన ఫోన్లతో పాటు, మన బాధ్యతలను కూడా కొంచెం చార్జ్ చేసుకుంటే మంచిదని ఈ ఘటన గుర్తు చేస్తోంది.




