Viral News : మానేరు చెక్‌డ్యామ్‌లో అరుదైన చేప.. తీరానికి తాకిన వింత జీవి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామం వద్ద ఉన్న మానేరు చెక్‌డ్యామ్‌లో ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది.
Rare black fish
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామం వద్ద ఉన్న మానేరు చెక్‌డ్యామ్‌లో ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా మత్స్యకారుల వలలో రకరకాల నాటు చేపలు చిక్కుతుంటాయి. కానీ ఈసారి అక్కడ చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని వింత అనుభవం ఎదురైంది. కంప్లీట్ నల్లటి రంగుతో, వింతైన ఆకారంలో ఉన్న ఒక అరుదైన చేప వలలో పడటంతో స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. తమ జీవితంలోనే ఇలాంటి చేపను ఎప్పుడూ చూడలేదని వారు స్పష్టం చేస్తున్నారు.
నోరు కింద భాగాన.. కంప్లీట్ బ్లాక్ బాడీ
గ్రామానికి చెందిన మత్స్యకారుడు ముత్యం సతీష్ మానేరు చెక్‌డ్యామ్‌లో రోజూలాగే చేపలు పడుతుండగా ఈ వింత జీవి అతడి వలలో చిక్కింది. ఆ చేపను బయటకు తీసి చూసిన సతీష్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న తోటి మత్స్యకారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. సాధారణంగా ఉండే చేపల శరీర అమరికకు, దీనికి చాలా వ్యత్యాసం ఉంది. పూర్తి నల్లటి రంగులో ఉండటమే కాకుండా, ఈ చేప నోరు సాధారణంగా ముందు వైపు కాకుండా కింది భాగంలో అమరి ఉండటం అందరినీ ఆకర్షించింది. ఈ వార్త క్షణాల్లో వ్యాపించడంతో గ్రామానికి చెందిన స్థానికులు, చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో చెక్‌డ్యామ్ వద్దకు చేరుకుని ఆ వింత చేపను ఆసక్తిగా తిలకించారు. కొందరు తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మార్కెట్‌కు తీసుకెళ్లినా కొనని జనం
ఈ అరుదైన రూపంతో కనిపించిన చేపను అమ్మేందుకు మత్స్యకారులు స్థానిక చేపల మార్కెట్‌కు తీసుకెళ్లారు. మార్కెట్లో నిత్యం రకరకాల రకాల చేపలను విక్రయించే వ్యాపారులు కూడా ఈ నల్లటి వింత చేపను చూసి విస్తుపోయారు. అయితే దాని ఆకారం చూడటానికి కాస్త వింతగా, భయానకంగా ఉండటంతో దాన్ని కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎవరూ ముందుకు రాలేదని మత్స్యకారులు తెలిపారు.
డెవిల్ ఫిష్‌గా ప్రచారం – నెటిజన్లలో జోరుగా చర్చ
రూపంలో వింతగా ఉన్న ఈ చేపను కొందరు స్థానిక మత్స్యకారులు 'డెవిల్ ఫిష్' (Devil Fish) గా భావిస్తున్నారు. అయితే శాస్త్రీయంగా ఇది ఏ జాతికి చెందిన నీటి జీవి అనే దానిపై మత్స్యశాఖ అధికారులు లేదా నిపుణులు పరిశీలించి అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతుండటంతో, అసలు ఈ చేప ఏ ప్రాంతానికి చెందినది, మానేరు చెక్‌డ్యామ్‌లోకి ఎలా వచ్చిందనే దానిపై నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.




