Viral Video: పాట్నాలో మిల్క్ ట్యాంకర్ బోల్తా.. పాల కోసం బకెట్లతో ఎగబడిన జనాలు..

బీహార్‌లోని పాట్నాలో రోడ్డుపై ఓ పాల ట్యాంకర్ బోల్తా పడటంతో స్థానికులు పాల కోసం విపరీతంగా ఎగబడ్డారు. బాటిళ్లు, బకెట్లతో వచ్చి పాలు పట్టుకెళ్లడమే కాకుండా, కొందరు ఏకంగా ట్యాంకర్ వద్దే నోరు పెట్టి పాలను తాగేశారు.

Ravi
By Ravi
Published on: 16 July 2026 7:39 PM IST
Viral Video
X

Viral Video: పాట్నాలో మిల్క్ ట్యాంకర్ బోల్తా.. పాల కోసం బకెట్లతో ఎగబడిన జనాలు..

Viral Video: సమాజంలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే, అందులో చిక్కుకున్న బాధితులను కాపాడటానికి బదులుగా అక్కడ కింద పడిపోయిన విలువైన వస్తువులను దోచుకునే స్వార్థపరుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. గతంలో మద్యం బాటిళ్లు, తాజా చేపలు, కోళ్లు తీసుకెళ్లే సరుకు రవాణా వాహనాలు అనుకోకుండా ప్రమాదానికి గురైనప్పుడు జనాలు ఎలా ఎగబడ్డారో మనం వార్తల్లో చాలాసార్లు కళ్లారా చూశాం. తాజాగా సరిగ్గా అలాంటి విచిత్రమైన ఘటనే బీహార్ రాష్ట్రం పాట్నాలో చోటుచేసుకుంది. అయితే ఈసారి రోడ్డుపై అదుపుతప్పి బోల్తా పడింది పాలకు సంబంధించిన భారీ ట్యాంకర్ కావడం ఇక్కడ గమనార్హం.

పాట్నాలోని ఒక ప్రధాన రహదారిపై వేగంగా వెళ్తున్న పాల ట్యాంకర్ డ్రైవర్ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి ఉన్నట్టుండి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఊహించని ప్రమాదంలో ట్యాంకర్ బాగా దెబ్బతిని అందులో నుంచి పాలు భారీగా బయటకు లీక్ కావడం మొదలైంది. ఇది గమనించిన చుట్టుపక్కల ఉన్న స్థానికులు, అటుగా వెళ్లే వాహనదారులు డ్రైవర్ పరిస్థితి ఏంటని కనీసం పట్టించుకోలేదు. పాలు రోడ్డు పాలు అవుతున్నాయని చూసి వెంటనే తమ ఇళ్ల నుంచి బకెట్లు, డబ్బాలు, వాటర్ బాటిళ్లు, పెద్ద బిందెలు తీసుకుని ఘటనా స్థలానికి వేగంగా పరుగులు తీశారు. ట్యాంకర్ నుంచి లీకై కారుతున్న స్వచ్ఛమైన పాలను ఒకరితో ఒకరు పోటీ పడి మరీ పట్టుకున్నారు.

కొందరు వ్యక్తులైతే ఈ ఉచిత లూటీలో మరో అడుగు ముందుకు వేశారు. తాము ఇంటి నుంచి తెచ్చుకున్న బాటిళ్లు, బకెట్లు పూర్తిగా నిండిపోవడంతో, ఇంకా కారుతున్న పాలను నేలపై వృథా చేయడం ఇష్టం లేక ఏకంగా ట్యాంకర్ రంధ్రం వద్దే తమ నోరు పెట్టి పాలను నేరుగా తాగేశారు. ఈ విచిత్రమైన దృశ్యాన్ని అక్కడే ఉన్న కొందరు యువకులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉచితంగా దొరుకుతున్నాయి కదా అని పాలు పట్టుకోవడానికి జనాలు చేసిన ఈ విపరీతమైన హడావుడి చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కానీ వారు ఘటనా స్థలానికి వచ్చే లోపే చాలామంది తమకు దొరికిన కాడికి పాలను అక్రమంగా నింపుకొని అక్కడి నుంచి వేగంగా ఉడాయించారు. ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో సాయం చేయాలనే కనీస స్పృహ పూర్తిగా మంటగలిసిపోతోందని ఈ దారుణ ఘటన మనకు స్పష్టం చేస్తోంది. ఒకరి ఆస్తి నష్టాన్ని తమకు సొంత లాభంగా మార్చుకునే ఇలాంటి పాడుబుద్ధి నేటి ఆధునిక సమాజానికి ఏమాత్రం మంచిది కాదని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆలస్యంగా అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది, ప్రమాదానికి గల అసలు కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story