Viral : ఒక్క రూపాయికే నచ్చిన డ్రెస్.. సోషల్ మీడియా రూమర్‌తో మాల్‌లో తొక్కిసలాట
Viral : ముంబైలోని ఇన్‌ఫినిటీ మాల్‌లో ఒక్క రూపాయికే బట్టల సేల్ ఉందనే సోషల్ మీడియా పుకారుతో భారీ తొక్కిసలాట జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Mumbai Mall
Viral : ముంబైలోని మలాడ్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ ఇన్‌ఫినిటీ మాల్ శనివారం సాయంత్రం ఊహించని ఉత్కంఠకు వేదికైంది. వీకెండ్ కావడంతో సాధారణంగానే మాల్‌లో రద్దీ ఉంది. అయితే అదే సమయంలో సోషల్ మీడియాలో ఒక వింత పుకారు షికారు చేసింది. మాల్‌లోని ఒక ప్రముఖ దుస్తుల షోరూమ్‌లో కేవలం ఒక్క రూపాయికే బట్టలు అమ్ముతున్నారనే వార్త దావానలంలా వ్యాపించింది. ఇంకేముంది, ఈ మెసేజ్ చూసిన వేలాది మంది జనం ఒక్కసారిగా మాల్ వైపు పరుగులు తీశారు.
యుద్ధభూమిగా మారిన కారిడార్లు
కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే షోరూమ్ ముందు భారీగా జనం మోహరించారు. ఆఫర్ ఎక్కడ చేజారిపోతుందోనని ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో మాల్ కారిడార్లలో తీవ్రమైన తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. జనం కేకలు, గందరగోళంతో మాల్ అంతా అల్లకల్లోలంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. గంటల తరబడి లైన్లలో నిలబడటంతో సామాన్య ప్రజల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
సమయస్ఫూర్తితో వ్యవహరించిన పోలీసులు
పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన మాల్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందం షోరూమ్ వైపు దూసుకొస్తున్న గుంపును అడ్డుకుంది. ప్రజలను శాంతింపజేస్తూ, నచ్చజెప్పి క్రమపద్ధతిలో మాల్ వెలుపలికి పంపించారు. పోలీసుల ముందస్తు చర్యల వల్ల ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం
ఈ 1 రూపాయి సేల్ అనే నకిలీ పోస్ట్‌ను సోషల్ మీడియాలో మొదట ఎవరు పెట్టారు? ఈ పుకారు వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంటర్నెట్‌లో వచ్చే ప్రతి ఆఫర్‌ను గుడ్డిగా నమ్మవద్దని, ఏదైనా బ్రాండ్ ఆఫర్ ప్రకటిస్తే వారి అధికారిక వెబ్‌సైట్లలో సరిచూసుకోవాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం ఎలాంటి శాంతిభద్రతల సమస్యలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.




