Viral News : పాస్‌పోర్టే లేని విద్యార్థికి 'అబుదాబి'లో సెంటర్.. రీ-నీట్' హాల్ టికెట్ల గందరగోళం.!
Viral News : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వ్యవహారశైలి, ఆ సంస్థ దొర్లిస్తున్న పొరపాట్లు విద్యార్థులను నిత్యం బెంబేలెత్తిస్తూనే ఉన్నాయి. పేపర్ లీకేజీల...
NEET-2026-Re-Exam
Viral News : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వ్యవహారశైలి, ఆ సంస్థ దొర్లిస్తున్న పొరపాట్లు విద్యార్థులను నిత్యం బెంబేలెత్తిస్తూనే ఉన్నాయి. పేపర్ లీకేజీల కారణంగా రద్దయి, రేపు (జూన్ 21న) జరగబోయే 'రీ-నీట్ యూజీ 2026' (NEET-UG 2026) పరీక్షకు సిద్ధమవుతున్న ఒక విద్యార్థికి ఎన్‌టీఏ కోలుకోలేని షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన విద్యార్థి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోగా.. పరీక్షా కేంద్రం ఏకంగా దేశం దాటి విదేశంలో కనిపించింది. అసలు పాస్‌పోర్టే లేని ఆ విద్యార్థికి విదేశీ సెంటర్ కేటాయించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నాగ్‌పూర్‌లో అప్లై చేస్తే.. అబుదాబిలో సెంటరా.?
నాగ్‌పూర్‌కు చెందిన అబ్దుల్లా మహ్మద్ తాలిబ్ అనే అభ్యర్థి రేపటి రీ-టెస్ట్ కోసం తన హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. తీరా అందులో ఎగ్జామ్ సెంటర్ చూసి అతను, అతని కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. అందులో పరీక్షా కేంద్రంగా భారతదేశంలోని ఏ నగరమో కాకుండా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని అయిన అబుదాబిలోని ఒక ఇండియన్ స్కూల్ పేరు కనిపించింది. నాగ్‌పూర్ నుండి లోకల్ సెంటర్ కోసం దరఖాస్తు చేసుకుంటే, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న విదేశీ కేంద్రాన్ని ఎలా కేటాయిస్తారంటూ సదరు విద్యార్థి లబోదిబోమన్నాడు.
పాస్‌పోర్టే లేదు.. పరీక్ష ఎలా రాయాలి.?
ఈ విచిత్ర ఘటనలో మరో పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. విద్యార్థి అబ్దుల్లా వద్ద అసలు పాస్‌పోర్టే లేదు. ఒకవేళ అంతంత దూరం వెళ్లి పరీక్ష రాయాలనుకున్నా పాస్‌పోర్ట్ లేకుండా విదేశాలకు వెళ్లడం అసాధ్యం. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఈ హాల్ టికెట్ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఎన్‌టీఏ నిర్లక్ష్యంపై నెటిజన్లు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు.
సాంకేతిక లోపమే కారణమన్న ఎన్‌టీఏ
బాధిత విద్యార్థి కుటుంబం ఈ విషయాన్ని వెంటనే ఎన్‌టీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన అధికారులు ఇది కేవలం ఒక 'టెక్నికల్ గ్లిచ్' (సాంకేతిక లోపం) కారణంగానే జరిగిందని అంగీకరించారు. తప్పును వెంటనే సరిదిద్ది, లోకల్ సెంటర్‌తో కూడిన కొత్త అడ్మిట్ కార్డును జారీ చేస్తామని హామీ ఇస్తూ విద్యార్థికి ఈ-మెయిల్ కూడా పంపారు.
నిజానికి విదేశాల్లో నివసించే భారతీయ విద్యార్థులు, ఎన్‌ఆర్ఐ (NRI), ఓసిఐ (OCI) అభ్యర్థుల కోసం ఎన్‌టీఏ దుబాయ్, అబుదాబి, దోహా, మస్కట్, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాల్లో నీట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. అయితే ఆ డేటాబేస్ లోని లోపం వల్ల నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వచ్చేసింది.
తుది క్షణంలోనూ కొనసాగుతున్న గందరగోళం
ఒక్క అబ్దుల్లా విషయమే కాదు.. రేపటి రీ-టెస్ట్ నేపథ్యంలో ఎన్‌టీఏ హాల్ టికెట్లు, ఎగ్జామ్ టైమింగ్స్, సెంటర్ల కేటాయింపులో తీవ్ర గందరగోళం నెలకొంది. మరో విద్యార్థికి ఏకంగా సాయంత్రం 4 గంటలకు ఎగ్జామ్ అంటూ హాల్ టికెట్‌లో తప్పుడు సమయం ప్రింట్ అయింది. అయితే విద్యార్థులెవరూ కంగారుపడాల్సిన పనిలేదని, తప్పులను సరిదిద్దుతున్నామని ఎన్‌టీఏ మెసేజ్‌లు పంపుతోంది.
రేపే రీ-నీట్ పరీక్ష.. నేడే మాక్‌డ్రిల్
పేపర్ లీకేజీ ఆరోపణల తర్వాత నిర్వహిస్తున్న ఈ రీ-నీట్ పరీక్ష రేపు (జూన్ 21న) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు 'పెన్-అండ్-పేపర్' (ఆఫ్‌లైన్) విధానంలో జరగనుంది. అడ్మిట్ కార్డుల్లో ఎలాంటి తప్పులున్నా వెంటనే సంప్రదించాలని ఎన్‌టీఏ కోరుతోంది. పరీక్షను ఎలాంటి అక్రమాలు లేకుండా నిర్వహించేందుకు గానూ.. ఈరోజు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అధికారులు 'మాక్‌డ్రిల్' కూడా నిర్వహించబోతున్నారు.




