Viral Video: ఆకస్మిక వరదలు.. బస్సు దిగుతూ వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన మహిళ!

Viral Video: అమెరికాలోని న్యూయార్క్ సిటీని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. క్వీన్స్, బ్రూక్లిన్ ప్రాంతాలు నీట మునిగాయి. బస్సు దిగుతూ ఓ మహిళ వరద ఉధృతికి కొట్టుకుపోయిన షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Arun Chilukuri
Published on: 22 May 2026 12:09 PM IST
Viral Video
X

Viral Video: ఆకస్మిక వరదలు.. బస్సు దిగుతూ వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన మహిళ!

Viral Video: అమెరికాలోని ప్రముఖ నగరం న్యూయార్క్ భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుపానుల కారణంగా అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన రికార్డు స్థాయి వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు ఆకస్మిక వరదల్లో (Flash Floods) చిక్కుకున్నాయి. ముఖ్యంగా క్వీన్స్, బ్రూక్లిన్ వంటి జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో రహదారులు నదులను తలపించాయి. వరద ప్రభావం కారణంగా నగరంలోని కీలకమైన సబ్‌వే (Subway) రైలు సేవలు కూడా నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో కేవలం గంట వ్యవధిలోనే దాదాపు 5 సెంటీమీటర్ల (రెండు అంగుళాలకు పైగా) భారీ వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.

నగరంలో వరదల తీవ్రత ఎంత దారుణంగా ఉందో చూపించే ఓ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కేవలం 15 సెకన్ల నిడివి గల ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు.

రోడ్డుపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో, ఓ సిటీ బస్సు డ్రైవర్ వాహనాన్ని ఫుట్‌పాత్ పక్కకు ఆపలేక.. రోడ్డు మధ్యలోనే నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులు నేరుగా వరద నీటిలోనే దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ సమయంలో పింక్ కలర్ డ్రెస్ ధరించిన ఓ మహిళ బస్సు దిగి, నెమ్మదిగా ఫుట్‌పాత్ చేరేందుకు ప్రయత్నించింది. అయితే, వరద ప్రవాహం ఊహించని విధంగా బలంగా ఉండటంతో ఆమె అదుపు తప్పి కిందపడిపోయింది. రోడ్డు పక్కనున్న అంచును (Curb) బలంగా ఢీకొట్టి, చూస్తుండగానే ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. అక్కడున్న వారు ఆమెను రక్షించేందుకు పరుగెత్తుకెళ్లినప్పటికీ.. ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో కాపాడలేకపోయారు.

ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డ్రైవర్ కనీస అవగాహన లేకుండా బస్సును రోడ్డు మధ్యలో ఆపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కొందరు మండిపడుతుండగా.. సదరు మహిళ సురక్షితంగా బయటపడాలని ఆశిస్తున్నామంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ అంతం లేని వర్షాలపై న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ స్పందించారు. భారీ వర్షాల కారణంగా నగరంలోని మురుగునీటి డ్రైనేజీ వ్యవస్థ (Drainage System) పూర్తిగా స్తంభించిపోయిందని ఆయన తెలిపారు. సాధారణంగా నగరంలోని మురుగునీటి వ్యవస్థ గంటకు గరిష్టంగా రెండు అంగుళాల వర్షాన్ని మాత్రమే తట్టుకునేలా రూపొందించబడిందని.. కానీ ఈసారి అంతకంటే ఎక్కువ వర్షం అత్యంత తక్కువ సమయంలో కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయని వివరించారు.

వరదలు, నీటి నిల్వల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు నగర అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చని.. అత్యవసర సహాయం, రెస్క్యూ సేవల కోసం వెంటనే '311' నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు నగర ప్రజలకు సూచించారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story