Viral News : 40 వేల పౌండ్ల బీర్ చోరీ.. దొంగకు 18 రోజుల డెడ్‌లైన్.!

Viral News : అమెరికాలో జరిగిన ఓ భారీ బీర్ చోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏకంగా 40 వేల పౌండ్ల (దాదాపు 18 వేల కిలోలు) బీర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు.

G Krishna
Published on: 2 Sept 2026 7:22 PM IST
Pabst Blue Ribbon
X

Pabst Blue Ribbon

Viral News : అమెరికాలో జరిగిన ఓ భారీ బీర్ చోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏకంగా 40 వేల పౌండ్ల (దాదాపు 18 వేల కిలోలు) బీర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే దొంగలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు.. ఆ బీర్ కంపెనీ చేసిన ఓ వింత విజ్ఞప్తి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

34 వేల బీర్ క్యాన్లు మాయం

టెక్సాస్‌కు చెందిన Pabst Blue Ribbon కంపెనీకి చెందిన దాదాపు 34 వేల బీర్ క్యాన్లు ఆగస్టు 17న కాలిఫోర్నియాలోని మాంట్‌క్లెయిర్‌లో ఓ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి చోరీకి గురయ్యాయి. నకిలీ డాక్యుమెంట్లను ఉపయోగించి సరుకును తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

దొంగకు 18 రోజుల టైమ్

చోరీ విషయం బయటపడిన తర్వాత Pabst Blue Ribbon సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక పోస్టు చేసింది. బీర్‌ను తీసుకెళ్లిన వ్యక్తికి ఏకంగా 18 రోజులు, 44 నిమిషాల గడువు ఇచ్చింది. ఆ సమయంలోపు బీర్‌తో కూడిన ట్రక్కును తిరిగి ఇచ్చేస్తే ఎలాంటి ప్రశ్నలు అడగబోమని ప్రకటించింది. అంతేకాదు, కేసు పరిష్కారానికి సహాయం చేసే వారికి రివార్డ్ కూడా ఇస్తామని తెలిపింది.

‘ఇది నిజమే’ అంటూ కంపెనీ

ఇదంతా మార్కెటింగ్ స్టంట్ అనుకునే అవకాశం ఉండటంతో.. కంపెనీ మరో ఆసక్తికరమైన క్లారిటీ ఇచ్చింది. ఈ చోరీ నిజంగానే జరిగిందని, తాము చాలా సీరియస్‌గా ఉన్నామని పేర్కొంది. దొంగతనానికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి.. బీర్ ఎక్కడుందో గుర్తించడంలో నెటిజన్లు సహకరించాలని కోరింది.

కిట్‌క్యాట్ కూడా ఎంట్రీ

ఈ ఘటన గతంలో జరిగిన ఓ భారీ కిట్‌క్యాట్ చోరీని గుర్తుచేసింది. యూరప్‌లో ఇటలీ నుంచి పోలాండ్‌కు వెళ్తున్న ట్రక్కు నుంచి దాదాపు 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లు చోరీకి గురయ్యాయి. ఇప్పుడు బీర్ చోరీపై Pabst పోస్టు చేయడంతో కిట్‌క్యాట్ కూడా స్పందించింది. ఇలాంటి చోరీల గురించి తమకు కొంత అనుభవం ఉందంటూ సరదాగా కామెంట్ చేసింది.

నెటిజన్ల కామెడీ కామెంట్స్

బీర్ చోరీ వార్త వైరల్ కావడంతో నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 40 వేల పౌండ్ల బీర్ ట్రక్ తమ దగ్గర లేకపోయినా.. అంత బీర్‌ను తాగేయాలనే ఆసక్తి ఉందంటూ కొందరు సరదాగా కామెంట్ చేశారు. మరికొందరు Pabst Light అయితే ట్రక్ బరువు సగమే ఉండేదంటూ జోకులు పేల్చారు. బీర్ ఇంకా దొరకకపోవడంతో.. ఇంత భారీ మొత్తంలో సరుకును దొంగలు ఎక్కడ దాచారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story