Anthropic engineer : ఉద్యోగాల భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చిన ఆంత్రోపిక్ ఇంజనీర్.. వైరల్ అవుతున్న సలహాలు.!

Anthropic engineer : కృత్రిమ మేధ (AI) నేడు మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. ఉద్యోగాల భవిష్యత్తు, పని చేసే విధానం ఎలా మారుతుందో అన్న ఆందోళన చాలామందిలో ఉంది.

G Krishna
Published on: 8 May 2026 10:33 AM IST
Anthropic engineer
X

Anthropic engineer

Anthropic engineer : కృత్రిమ మేధ (AI) నేడు మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. ఉద్యోగాల భవిష్యత్తు, పని చేసే విధానం ఎలా మారుతుందో అన్న ఆందోళన చాలామందిలో ఉంది. ఇలాంటి సమయంలో ప్రముఖ AI పరిశోధన సంస్థ 'ఆంత్రోపిక్' (Anthropic) లో అప్లైడ్ ఏఐ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఐజా ఉస్మాన్ ప్రయాణం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కంటెంట్ క్రియేటర్ హమ్జా చిస్తీతో ఆమె పంచుకున్న విశేషాలు, యువతకు ఆమె ఇచ్చిన సలహాలు ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

పాకిస్థాన్ నుంచి అమెరికా వరకు.. కృషితో సాగిన ప్రయాణం

ఐజా ఉస్మాన్ తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పాకిస్థాన్‌లో పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడ కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె, అదే తన కెరీర్‌కు బలమైన పునాది అని చెబుతారు. తన ఉన్నత చదువుల సమయంలో ఆమె జెనరేటివ్ మోడల్స్, లార్జ్ లాంగ్వేజ్ సిస్టమ్స్ , ట్రాన్స్‌ఫార్మర్ ఆర్కిటెక్చర్ వంటి క్లిష్టమైన అంశాలపై లోతైన పరిశోధన చేశారు. నేడు మనం వాడుతున్న చాట్ బాట్లు, ఇతర ఏఐ టూల్స్ వెనుక ఉన్న అసలు సాంకేతికత ఇదే కావడం గమనార్హం.

క్లాస్‌రూమ్ నుంచి స్టార్టప్ దాకా.. ఆచరణాత్మక అనుభవం

చదువుకుంటున్న సమయంలోనే ఐజా ఒక ఫిన్‌టెక్ (Fintech) స్టార్టప్‌లో పని చేయడం ప్రారంభించారు. పుస్తకాల్లో చదివిన పాఠాల కంటే, క్షేత్రస్థాయిలో సమస్యలను ఎదుర్కోవడం వల్లే తాను ఎక్కువ నేర్చుకున్నానని ఆమె తెలిపారు. అక్కడ రియల్ వరల్డ్ ప్రాజెక్టులపై పనిచేస్తూ, ఇంటెలిజెంట్ సిస్టమ్స్ , టూల్స్ అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ అనుభవమే ఆమెకు ఆంత్రోపిక్ వంటి అగ్రగామి సంస్థలో అవకాశం దక్కేలా చేసింది. ఏఐ రంగంలో రాణించాలంటే కేవలం చదువు మాత్రమే సరిపోదని, ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరమని ఆమె నిరూపించారు.

ఆంత్రోపిక్ , ఓపెన్ ఏఐ..

ఆంత్రోపిక్ (Anthropic) సంస్థలో తన పనితీరు గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏఐ రంగంలో భద్రత , రెస్పాన్సిబుల్ డెవలప్మమెంట్ కి కంపెనీలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో ఐజా వివరించారు. ఓపెన్ ఏఐ (OpenAI) , ఆంత్రోపిక్ రెండూ కూడా మానవ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, సురక్షితమైన వ్యవస్థలను నిర్మించడంపై దృష్టి సారిస్తాయని ఆమె తెలిపారు. కేవలం కొత్త ఆలోచనలతో వేగంగా ముందుకు వెళ్లడమే కాకుండా, అవి మానవ విలువలకి అనుగుణంగా ఉన్నాయో లేదో చూసుకోవడం ఆంత్రోపిక్ ప్రత్యేకత అని ఆమె పేర్కొన్నారు.

యువతకు ఐజా ఇస్తున్న విలువైన సలహా

ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయని భయపడే యువతకు ఐజా ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ఈ టూల్స్ కేవలం టెక్నికల్ రంగాలకే పరిమితం కాలేదని, ప్రతి పనిలోనూ ఇవి భాగమయ్యాయని ఆమె గుర్తు చేశారు. వీటిని చూసి భయపడటం లేదా దూరం పెట్టడం కంటే, ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం ఉత్తమమని ఆమె సూచించారు. నేటి మారుతున్న ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే కొత్త మార్పులకు అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవడమే (Adapting) అత్యంత ముఖ్యమైన నైపుణ్యం అని ఐజా ఉస్మాన్ స్పష్టం చేశారు.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story