Viral Video: రీల్స్ పిచ్చిలో కన్నబిడ్డనే మరిచారు.. అలల్లో చిన్నారి పడిపోయినా వీడియో తీస్తూ నిర్లక్ష్యం!

Viral Video: సముద్ర తీరంలో రీల్స్ పిచ్చిలో పడి కన్నబిడ్డ ప్రాణాలను ముప్పులోకి నెట్టిన తల్లిదండ్రుల ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.

Arun Chilukuri
Published on: 21 Oct 2026 10:24 AM IST
Viral Video
X

Viral Video: రీల్స్ పిచ్చిలో కన్నబిడ్డనే మరిచారు.. అలల్లో చిన్నారి పడిపోయినా వీడియో తీస్తూ నిర్లక్ష్యం!

Viral Video: సోషల్ మీడియా పిచ్చిలో పడి కొందరు కనీస మానవత్వంతో పాటు కన్నబిడ్డ బాధ్యతలను కూడా విస్మరిస్తున్నారు. తాజాగా ఓ జంట తమ చిన్నారి ప్రాణాల కంటే సోషల్ మీడియా రీల్‌కే ప్రాధాన్యతనిచ్చిన ఘటన నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. సముద్ర తీరంలో అలల తాకిడికి చిన్నారి ఇబ్బంది పడుతూ కిందపడిపోయినా పట్టించుకోకుండా, రీల్ వీడియో చిత్రీకరణలోనే మునిగిపోయిన తల్లిదండ్రుల నిర్లక్ష్యం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

అసలేం జరిగిందంటే..!

ఓ జంట తమ చిన్నారితో కలిసి సముద్ర తీరానికి విహారయాత్రకు వెళ్లారు. అక్కడ రీల్ వీడియో తీసే క్రమంలో మొదట తల్లి చిన్నారి చేయి పట్టుకుని నడిపించినప్పటికీ, ఆ తర్వాత కెమెరాకు పోజులు ఇవ్వడంలో మునిగిపోయారు. అదే సమయంలో వచ్చిన సముద్రపు అలల తాకిడికి చిన్నారి నిలదొక్కుకోలేక కిందపడిపోయింది. అలల వేగానికి లేవలేక ఆ పాప ఇబ్బంది పడుతున్నా, తల్లిదండ్రులు మాత్రం తమ రికార్డింగ్‌ను ఆపకుండా పోజులు ఇవ్వడానికే ప్రాధాన్యతనిచ్చారు.

అక్కడే ఉన్న ఓ అపరిచితుడు ఈ విషయాన్ని గమనించి వెంటనే స్పందించాడు. నీటిలో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి వద్దకు పరుగెత్తుకెళ్లి సురక్షితంగా బయటకు తీసి, ఆ తల్లిదండ్రులకు అప్పగించాడు. ఈ దృశ్యాలను చూసిన ఒక నెటిజన్ ఆ వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ దంపతుల ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. "సోషల్ మీడియా లైక్స్, వ్యూస్ కోసం కన్నబిడ్డ ప్రాణాలను కూడా లెక్కచేయరా?" అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే దానిపై స్పష్టత లేనప్పటికీ, సోషల్ మీడియా వ్యసనం తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యానికి ఏ స్థాయికి దారితీస్తోందోననడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.