Pitbull Attack in Patiala: అద్దె కోసం వచ్చిన దంపతులపై పిట్‌బుల్ కుక్క దాడి.. సీసీటీవీ ఫుటేజ్ వైరల్..!

Pitbull Attack in Patiala: పటియాలాలోని ఘుమన్ నగర్‌లో ఇల్లు చూసేందుకు వెళ్లిన దంపతులపై పిట్‌బుల్ కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

Naresh.k
Published on: 13 Aug 2026 11:36 AM IST
Pitbull Attack in Patiala
X

Pitbull Attack in Patiala: అద్దె కోసం వచ్చిన దంపతులపై పిట్‌బుల్ కుక్క దాడి.. సీసీటీవీ ఫుటేజ్ వైరల్..!

Pitbull Attack in Patiala: కొత్తగా ఇల్లు చూసేందుకు వెళ్లిన ఆ దంపతులకు ఆ క్షణంలో రాబోతున్న ముప్పు గురించి ఇంత కూడా ఊహ లేదు. కానీ, ఒక్క క్షణం... కేవలం ఒక్క రెప్పపాటు కాలంలో జరిగిన ప్రమాదం ఆ కుటుంబంలో భయాందోళనలను నింపింది. పంజాబ్‌లోని పటియాలాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పటియాలా నివాసులైన అంకిత్ సభర్వాల్, ఆయన భార్య షిఫాలీ తమ అవసరాల నిమిత్తం అద్దెకు ఒక ఇల్లు వెతుకుతున్నారు. అందులో భాగంగానే మంగళవారం సాయంత్రం ఘుమన్ నగర్ ప్రాంతంలోని ఒక ఇంటిని పరిశీలించడానికి ప్రాపర్టీ డీలర్‌తో కలిసి వెళ్లారు.

వారు ఆ ఇంటికి చేరుకుని గేటు దగ్గర ఉన్న సమయంలో ఊహించని ప్రమాదం ముంచుకొచ్చింది. అకస్మాత్తుగా ఆ ఇంటి గేటు ఒక్కసారిగా తెరుచుకోవడంతో... లోపల ఉన్న పిట్‌బుల్ కుక్క బయటకు దూసుకొచ్చింది. నేరుగా షిఫాలీపైకి దూకి ఆమె చేతిని తీవ్రంగా గాయపరిచింది. భార్యను కాపాడుకునేందుకు ముందుకు వచ్చిన అంకిత్ పైకి కూడా ఆ కుక్క ఎగబడి కరిచింది. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కుక్క విరుచుకుపడుతున్న తీరు చూసేవారికి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వెంటనే అప్రమత్తమైన ప్రాపర్టీ డీలర్ , స్థానికులు కర్రలతో కుక్కను తరిమేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ సమయంలో ఇంట్లో నుంచి ఒక మహిళ కర్రతో బయటకు వచ్చినప్పటికీ, ఆ కుక్కను అదుపు చేయలేకపోయింది. ఎట్టకేలకు స్థానికులు ఆ కుక్కను తరిమికొట్టడంతో పెను ప్రమాదం తప్పింది.

బాధితుడు అంకిత్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ..మేము అద్దెకు తీసుకోవాలనుకున్న ఇల్లు చూసేందుకు వెళ్లాము. అకస్మాత్తుగా కుక్క బయటకు వచ్చి మాపై దాడి చేసింది. నా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆమె ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో అంకిత్ కాళ్లు, వీపుపై కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ దంపతులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై యంత్రాంగం సీరియస్‌గా స్పందించింది. బాధితుల వాంగ్మూలం ఆధారంగా, కుక్క యజమాని నిర్లక్ష్య వైఖరిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 291 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

పటియాలా మేయర్ కుందన్ గోగియా స్పందిస్తూ.. నగరంలో ఇలాంటి దూకుడు స్వభావం గల కుక్క జాతులను పెంపుడు జంతువులుగా పెంచుకోవడాన్ని పూర్తిగా నిషేధిస్తామని, మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఈ మేరకు ప్రత్యేక తీర్మానం ప్రవేశపెడతామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పూజా గ్రెవాల్ మాట్లాడుతూ.. పిట్‌బుల్స్ వంటి అత్యంత క్రూరమైన జాతులను నిబంధనల ప్రకారం పెంచుకోవడానికి వీలులేదని స్పష్టం చేశారు. బాధితులను పరామర్శించామని, రికార్డులు పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేవలం ఐదేళ్ల వ్యవధిలో కుక్కకాటు కేసులు మూడు రెట్లు పెరగడం విశేషం. 2025 నాటికి నమోదైన 3.34 లక్షల కేసులు ఇప్పటివరకు ఒకే సంవత్సరంలో అత్యధికం కావడం పంజాబ్ ప్రజలను కలవరపెడుతోంది.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story