Pope Leo XIV : పోప్‌కే KYC టెన్షన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రేజీ స్టోరీ.!
Pope Leo XIV : ఒక దేశాధినేతకో లేదా ఒక ఆధ్యాత్మిక గురువుకో సామాన్యుల లాగే ఇబ్బందులు ఎదురైతే ఎలా ఉంటుంది? వినడానికి వింతగా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది
Pope Leo XIV
Pope Leo XIV : ఒక దేశాధినేతకో లేదా ఒక ఆధ్యాత్మిక గురువుకో సామాన్యుల లాగే ఇబ్బందులు ఎదురైతే ఎలా ఉంటుంది? వినడానికి వింతగా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరాధ్య దైవమైన పోప్ లియో XIV కి సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన బ్యాంకు ఖాతాకు సంబంధించిన చిన్న పని కోసం ఆయన చేసిన ఫోన్ కాల్, ఇప్పుడు ఇంటర్నెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కథనంగా మారింది. వివాదాల వల్ల కాకుండా, సామాన్యులకు ఎదురయ్యే బ్యాంకింగ్ ఇబ్బందులే పోప్‌కు కూడా ఎదురుకావడంతో ప్రజలు ఈ స్టోరీకి బాగా కనెక్ట్ అవుతున్నారు.
చిన్న పని.. పెద్ద చిక్కు
ఈ ఆసక్తికరమైన ఘటన గత ఏడాది జరిగింది. అప్పటికి రాబర్ట్ ప్రివోస్ట్ (పోప్ లియో అసలు పేరు) పోప్‌గా బాధ్యతలు చేపట్టి కేవలం రెండు నెలలు మాత్రమే అయింది. చికాగోలోని తన పాత బ్యాంకు ఖాతాలో చిరునామా , ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేయమని అడగడానికి ఆయన బ్యాంకుకు ఫోన్ చేశారు. భద్రతాపరమైన అన్ని ప్రశ్నలకు ఆయన సరైన సమాధానాలు ఇచ్చారు. వెరిఫికేషన్ ప్రక్రియ అంతా పూర్తయింది. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నప్పటికీ, బ్యాంకు నిబంధనల ప్రకారం ఖాతాదారుడు స్వయంగా బ్యాంకుకు రావాలని కస్టమర్ కేర్ ప్రతినిధి తెగేసి చెప్పారు.
నేను పోప్‌ని అండి.. అన్నా వినలేదు.
ఆమెకు తన పరిస్థితిని వివరించడానికి పోప్ ప్రయత్నించారు. తాను ఇప్పుడు చికాగోలో లేనని, వ్యక్తిగతంగా రావడం కుదరదని ఎంత చెప్పినా ఆమె వినలేదు. కేవలం బ్యాంకు పాలసీ గురించి మాత్రమే ఆమె పదే పదే ప్రస్తావించింది. చిట్టచివరి ప్రయత్నంగా పోప్, "నేను పోప్ లియోని అని చెబితే ఏమైనా మార్పు ఉంటుందా?" అని అడిగారు. కానీ అవతలి వ్యక్తి ఏమాత్రం తగ్గలేదు. అప్పటికే విసుగు చెందిన ఆ ప్రతినిధి, ఏకంగా పోప్ ఫోన్‌నే కట్ చేసేశారు. ఈ విషయాన్ని ఫాదర్ టామ్ మెక్‌కార్తీ ఒక కార్యక్రమంలో వివరిస్తూ.. "పోప్ ఫోన్‌ను కట్ చేసిన మహిళగా ఆమె ఎంతటి పేరు సంపాదించిందో ఊహించుకోండి" అంటూ నవ్వులు పూయించారు.
బ్యాంకు అధ్యక్షుడి వరకు వెళ్లిన వ్యవహారం
ఫోన్ కట్ అవ్వడంతో చేసేదేమీ లేక పోప్ తన స్నేహితుడైన మరో ఫాదర్ సహాయం కోరారు. ఆయన నేరుగా బ్యాంకు ప్రెసిడెంట్‌తో మాట్లాడారు. అయినా కూడా మొదట బ్యాంకు యాజమాన్యం తమ పాత నిబంధనలనే పట్టుకు వేలాడింది. దీంతో పోప్ తరపున ఒక గట్టి హెచ్చరిక వెళ్ళింది.. "సరే, మరి పోప్ తన ఖాతాను వేరే బ్యాంకుకు మార్చుకుంటారు" అని చెప్పడంతో బ్యాంకు దిగివచ్చింది. చివరకు ఆయన ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేశారు. ఆ పని పూర్తయిన తర్వాత పోప్ చాలా సింపుల్‌గా.. "నంబర్ అయితే మార్చారు కానీ, దీన్ని ఎవరికీ ఇవ్వకండి" అని చమత్కరించారట.
పోప్ అంటే మనలాంటి వారే
ఈ కథనాన్ని పంచుకున్న మెక్‌కార్తీకి పోప్ లియోతో 43 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతూ.. పోప్ చాలా సరళమైన మనస్తత్వం కలవారని పేర్కొన్నారు. మనలాగే ఆయనకు కూడా పిజ్జా అంటే ఇష్టమని, వైట్ సాక్స్ టీమ్ (బేస్ బాల్) మ్యాచ్‌లను ఇష్టపడతారని చెప్పారు. ఒక అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి కూడా బ్యాంకు కాల్స్ విషయంలో సామాన్యులు పడే అదే అసహనానికి గురవ్వడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బ్యాంకింగ్ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో చెప్పడానికి ఈ ఘటన ఒక సరదా ఉదాహరణగా నిలిచిపోయింది.




