Potti Sriramulu Jayanthi: ప్రజల కోసం జీవితాన్ని అర్పించిన అమరజీవి.. పొట్టిశ్రీరాములు

Potti Sriramulu Jayanthi: ఉద్యమం కోసం ప్రాణాలిచ్చారు. ప్రజల హృదయాల్లో అమరజీవిగా నిలిచారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన జీవిత ప్రయాణం..

KVD Varma
Published on: 16 March 2026 9:14 AM IST
Potti Sriramulu Jayanthi: ఉద్యమం కోసం ప్రాణాలిచ్చారు. ప్రజల హృదయాల్లో అమరజీవిగా నిలిచారు.
X

Potti Sriramulu Jayanthi

Potti Sriramulu Jayanthi: పట్టుదల.. తాను చేయాలనుకునే పనిని ప్రాణాలు పోయినా ఫర్వాలేదు పూర్తి చేయాల్సిందే అనే తపన చాలా తక్కువ మందిలో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చాలా అరుదుగా కనిపించే లక్షణాలు. అలాంటి అరుదైన పట్టుదల.. మొండితనం.. ప్రజల కోసం తాను సాధించాలి అనుకున్న దాని కోసం ప్రాణాలనే పణంగా పెట్టడం ఇవన్నీ మూర్తీభవించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని కలలు కని తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కోసం జీవితాన్ని తృణప్రాయంగా వదిలేసిన మహాశక్తి పొట్టి శ్రీరాములు. ఈరోజు (మార్చి 16) పొట్టి శ్రీరాములు జయంతి.

ఒక ఉద్యమం పురుడు పోసుకోవడం ఎంత కష్టమో ఆ ఉద్యమం సఫలం కావడం అంతకంటే ఎక్కువ కష్టం. ఉద్యమాన్ని ముందుండి నడిపించే నాయకుడు ఉండాలి. ఎన్ని దెబ్బలు పడ్డా తట్టుకుని చివరివరకూ ముందుండి నడిపించగలిగే తెగువ కావాలి. అలాంటి తెగువే పొట్టి శ్రీరాములు సొంతం. అదే తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చింది.

మహాత్మా గాంధీ స్ఫూర్తితో..

మహాత్మాగాంధీ స్పూర్తితో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో పాల్గొని.. అనేకసార్లు జైలు శిక్ష అనుభవించిన ఉద్యమ నేత పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న ప్రకాశం జిల్లాలోని పడమటపల్లి (నడికట్టువారి పల్లి)లో గురవయ్య మరియు మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. అక్కడ కరువు పరిస్థితుల వలన ఈ కుటుంబం మద్రాసుకు మారింది. తరువాత కొంతకాలానికి నెల్లూరు చేరుకున్నారు. మద్రాసులోనే పొట్టి శ్రీరాములు హై స్కూలు చదువు పూర్తి చేసి, శానిటరీ ఇంజనీరింగ్ చదవడానికి బొంబాయిలోని విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. తర్వాత, శ్రీరాములు బొంబాయిలోని గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో చేరారు. 1929 లో, శ్రీరాములు దురదృష్టవశాత్తు తన భార్య బిడ్డ ఇద్దరినీ కోల్పోయారు. రెండు సంవత్సరాల తరువాత, ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి, భారత స్వాతంత్య్ర పోరాటంలో సేవ చేయడానికి గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో చేరారు.

ఉపవాస దీక్షల ఉద్యమాలు..

పొట్టి శ్రీరాములు ఎప్పుడూ ఏ ఉద్యమం చేసినా ఉపావాస దీక్షలతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించే వారు. ఆయన 1930 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు జైలు పాలయ్యారు . 1941 - 1942 మధ్య, ఆయన వ్యక్తిగత సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. మూడుసార్లు జైలు శిక్ష అనుభవించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ జిల్లాలోని కొమరవోలులో గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు . కొమరవోలులో యెర్నేని సుబ్రహ్మణ్యం స్థాపించిన గాంధీ ఆశ్రమంలో ఆయన చేరారు. శ్రీరాములు అంకితభావం, ఉపవాస సామర్థ్యం గురించి వ్యాఖ్యానిస్తూ, మహాత్మా గాంధీ ఒకసారి ఇలా అన్నారు, "నాకు శ్రీరాములు లాంటి పదకొండు మంది అనుచరులు ఉంటే నేను ఒక సంవత్సరంలో బ్రిటిష్ పాలన నుండి స్వేచ్ఛ తీసుకురాగలుగుతాను." ఈ ఒక్క మాట చాలు పొట్టి శ్రీరాములు గొప్పతనాన్ని చెప్పడానికి.

దళితుల కోసం..

1923 - 1944 మధ్య, ఆయన నెల్లూరు జిల్లాలో చరఖా వస్త్ర-నూలు వడకడం విస్తృతంగా స్వీకరించడానికి కృషి చేశారు . నెల్లూరులో దేవాలయాల వంటి పవిత్ర స్థలాలలోకి ప్రవేశించడానికి దళితుల హక్కులకు మద్దతుగా 1946–1948 మధ్య ఆయన మూడు ఉపవాసాలు చేపట్టారు . నెల్లూరులోని మూలపేటలోని వేణు గోపాల స్వామి ఆలయంలోకి దళితుల ప్రవేశ హక్కులకు మద్దతుగా ఆయన నిరాహార దీక్ష చేశారు. చివరికి ఆ హక్కులు సాధించగలిగారు. దళిత సమాజాన్ని మరింత ఉద్ధరించడానికి మద్రాస్ ప్రభుత్వం ఆమోదించిన అనుకూలమైన ఉత్తర్వులను పొందడానికి ఆయన మళ్ళీ దీక్ష చేపట్టారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను వారానికి కనీసం ఒక రోజు దళితుల అభ్యున్నతి చర్యలకు హాజరు కావాలని ఆదేశించింది. తన జీవితపు చివరి దశలో, శ్రీరాములు నెల్లూరులో ఉండి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశారు. ఎర్రటి ఎండ మాడ్చేస్తున్నప్పటికీ లెక్కచేయకుండా చెప్పులు లేకుండా, గొడుగు లేకుండా, దళితుల అభ్యున్నతి కోసం నినాదాల ప్లకార్డులతో నగరంలో పాదయాత్ర సాగించారు. అప్పట్లో కొంతమంది స్థానికులు అతన్ని పిచ్చివాడిగా భావించారు. మిగిలిన అగ్రకులాల వారు ఆయనను శత్రువుగా చూసేవారు.

తెలుగు రాష్ట్ర ఉద్యమం..

అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న తెలుగు ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి, ఆంధ్ర ప్రజల సంస్కృతిని కాపాడటానికి, భాషా ప్రాతిపదికన.. మద్రాస్ రాజధానిగా ఆంధ్ర ప్రాంతాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి వేరు చేయాలనే ప్రజల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ఉపవాస దీక్ష మొదలు పెట్టారు. దీంతో అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. అప్పడు ఆయన తన సుదీర్ఘ నిరాహార దీక్షను ఆపారు. నెహ్రూ హామీ అయితే ఇచ్చారు కానీ, దానిని సాధ్యం చేయడం క్లిష్టంగా మారింది. దీనికి కారణం తెలుగు ప్రజలు మద్రాస్ ను తమ రాజధానిగా ఉంచాలని పట్టుపట్టడమే. ఈ ప్రతిపాదనను జవహర్‌లాల్ నెహ్రూ , వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య నేతృత్వంలోని JVP (జవహర్, వల్లభాయ్, పట్టాభి) కమిటీ ఆ అంగీకరించలేదు.

ఆమరణ దీక్ష..

ఆంధ్ర రాష్ట్ర అవతరణ విషయంలో జరుగుతున్న ఆలస్యాన్ని.. ఎదురవుతున్న నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ పొట్టి శ్రీరాములు మళ్ళీ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. అప్పటి ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ ఈ దీక్షను ఒప్పుకోలేదు. అయినాసరే, శ్రీరాములు 1952 అక్టోబర్ 19న మహర్షి బులుసు సాంబమూర్తి మద్రాసు ఇంట్లో తన నిరాహార దీక్షను ప్రారంభించారు. దీంతో ప్రజలు ఉద్యమ బాట పట్టారు. సమ్మెలు, నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. అయినప్పటికీ, ప్రభుత్వం మెత్తపడలేదు. ఈ నేపథ్యంలో 58 రోజుల పాటు నిరాహార దీక్షను కొనసాగించిన పొట్టి శ్రీరాములు డిసెంబర్ 16, 1952 రాత్రి మరణించారు. దేశ చరిత్రలోనే ఒక ఉద్యమం కోసం నిరసన దీక్ష చేపట్టి అమరులైన మహనీయుడు పొట్టిశ్రీరాములు ఒక్కరే.

ఆయన మరణం ప్రజలను మరింత సంఘటితం చేసింది. ఆయన మరణ ఊరేగింపులో, ప్రజలు ఆయన త్యాగాన్ని కీర్తిస్తూ నినాదాలు చేశారు, ఊరేగింపు మద్రాసులోని మౌంట్ రోడ్‌కు చేరుకునేసరికి వేలాది మంది పాల్గొన్నారు. ఊరేగింపు అల్లర్లకు దారితీసింది. ప్రజా ఆస్తులను నాశనం చేసింది. విజయనగరం , విశాఖపట్నం , విజయవాడ , భీమవరం , తాడేపల్లిగూడెం , రాజమండ్రి , ఏలూరు , గుంటూరు , తెనాలి , ఒంగోలు , కనిగిరి, నెల్లూరులలో అశాంతి చెలరేగింది. అనకాపల్లి, విజయవాడలలో ఏడుగురిని పోలీసులు కాల్చి చంపారు. దీంతో ప్రజా ఆందోళన మరింత ఉధృతంగా కొనసాగింది, మద్రాసు - ఆంధ్ర ప్రాంతాలలో సాధారణ జీవితాన్ని దెబ్బతీసింది. ఈ ఉద్యమ ధాటికి ప్రభుత్వం దిగివచ్చింది. 19 డిసెంబర్ 1952న, ప్రధాన మంత్రి నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు..

కర్నూలు రాజధానిగా 1 అక్టోబర్ 1953న, తెలుగు మాట్లాడే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. తరువాత, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే జిల్లాలను ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రాజధాని నగరంగా మారింది, ఇది నవంబర్ 1, 1956న ఏర్పడింది.

మహనీయుడికి మహా నివాళి

ఒక ఉద్యమంలో పోలీసు కాల్పుల్లోనో.. అల్లర్లలోనో ప్రాణాలు కోల్పోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఉద్యమం కోసం చనిపోతానని తెలిసీ.. నిరసన దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ అమరజీవిగానే నిలుస్తారు. ఈ ఏడాది పొట్టి శ్రీరాములు 125వ జయంత్యుత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఆయన విగ్రహాన్ని అమరావతిలో ప్రారంభిస్తున్నారు. స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైజ్ పేరుతొ సిద్ధం చేసిన ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు.

KVD Varma

KVD Varma

Next Story