Food Price Hike : రైలు ప్రయాణికులకు షాక్.. జూన్ 1 నుంచి టీ, సమోసా ఇక లగ్జరీ..!
Food Price Hike : రైలు ప్రయాణం చేస్తూ స్టేషన్లలో వేడివేడిగా సమోసా, ఆలూ వడ తింటూ ఎంజాయ్ చేసే వారికి బ్యాడ్ న్యూస్. దేశంలో నిరంతరం పెరుగుతున్న ఇంధన..
Food-Price-Hike
Food Price Hike : రైలు ప్రయాణం చేస్తూ స్టేషన్లలో వేడివేడిగా సమోసా, ఆలూ వడ తింటూ ఎంజాయ్ చేసే వారికి బ్యాడ్ న్యూస్. దేశంలో నిరంతరం పెరుగుతున్న ఇంధన ధరలు, ముడిసరుకుల రవాణా ఖర్చుల ప్రభావం ఇప్పుడు రైల్వే స్టేషన్లలోని ఫుడ్ స్టాళ్లపై పడింది. భారతీయ రైల్వేలోని సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని స్టేషన్లలో విక్రయించే ఆహార పదార్థాల ధరలను పెంచుతూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన కొత్త ధరలు 2026 జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.
33 రకాల వంటకాల రేట్లు అప్.. కొత్త ధరల వివరాలు
సెంట్రల్ రైల్వే విడుదల చేసిన కొత్త మెనూ జాబితా ప్రకారం స్టేషన్లలోని స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లలో విక్రయించే మొత్తం 33 రకాల ‘అలా కార్ట్’ ఆహార పదార్థాల ధరలను పెంచారు, అయితే మరో 16 వంటకాల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త ధరల ప్రకారం రైల్వే స్టేషన్లలో స్నాక్స్ రేట్లను గమనిస్తే వెజ్ సమోసా రూ.20 గాను, ఒక్క ఆలూ వడ ధర రూ.15 గాను, వెజ్ శాండ్విచ్ , మసాలా దోసె ధరలను రూ.35 గాను నిర్ణయించారు. వీటితో పాటు చోలే పూరీ రూ.40 కి, పవ్ భాజీ , వెజ్ పిజ్జా రూ.50 కి చేరాయి. వేసవిలో ప్రయాణికులు ఎక్కువగా తాగే ఫ్రెష్ జ్యూసుల ధరలు కూడా పెరిగాయి, ఇందులో క్యారెట్, పైనాపిల్, మామిడి, పుచ్చకాయ జ్యూస్ 200 మిల్లీలీటర్ల ధర రూ.25 కాగా, స్వీట్ లైమ్, ఆరెంజ్, ఆపిల్ జ్యూస్ ధరను రూ.40 గా ఖరారు చేశారు.
ధరలు పెరిగాయి సరే.. క్వాలిటీ మాటేంటి.?
రైల్వే శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో ధరల పెంపుతో పాటు ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. స్టేషన్లలోని లైసెన్స్‌దారులు అందరూ మారిన కొత్త ధరల జాబితాను కస్టమర్లకు స్పష్టంగా కనిపించేలా రెండు భాషల్లో ప్రదర్శించాలని స్పష్టం చేసింది. రేట్లు పెంచినందున ఆహార నాణ్యత, పరిమాణం విషయంలో రాజీ పడకూడదని, అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించాలని ఆర్డర్ వేసింది. మెనూ కార్డ్ కంటే ప్రయాణికుల నుంచి ఎక్కువ వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై తక్షణమే విచారణలు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
మిగిలిన జోన్లలోనూ రేట్లు పెరిగే ఛాన్స్..!
ప్రస్తుతానికి ఈ ధరల పెంపు నిర్ణయాన్ని సెంట్రల్ రైల్వే జోన్ మాత్రమే తీసుకున్నప్పటికీ, త్వరలోనే దేశంలోని మిగిలిన రైల్వే జోన్లు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉందని సమాచారం. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఛార్జీలు, ఇంధన ధరలు పెరగడం వల్ల క్యాటరింగ్ వ్యాపారం భారం అయిందని, అందుకే ఈ రేట్ల సవరణ తప్పలేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా జూన్ 1 నుంచి రైలు ఎక్కే ప్రయాణికులు తమ ఫుడ్ బడ్జెట్‌ను కాస్త పెంచుకోవాల్సిందే.




