Viral News : రణ్‌బీర్‌తో మిస్టర్ బీస్ట్.. ‘జై శ్రీరామ్’ నినాదంతో ముంబై షేక్.!

భారతీయ సినీ రంగానికి చెందిన మోస్ట్ అవైటెడ్ ఎపిక్ మూవీ ‘రామాయణ్’ ప్రమోషన్లు ప్రపంచ స్థాయిలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి.

G Krishna
Published on: 27 Sept 2026 6:31 PM IST
Ranbir Kapoor MrBeast Jai Shri Ram Ramayana Promotions
X

Ranbir Kapoor MrBeast Jai Shri Ram Ramayana Promotions

భారతీయ సినీ రంగానికి చెందిన మోస్ట్ అవైటెడ్ ఎపిక్ మూవీ ‘రామాయణ్’ ప్రమోషన్లు ప్రపంచ స్థాయిలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ముంబైలో నిర్వహించిన ఒక ప్రత్యేక ప్రమోషనల్ ఈవెంట్‌లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో పాటు ప్రపంచంలోనే అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న ప్రముఖ యూట్యూబర్ 'మిస్టర్ బీస్ట్' (జిమ్మీ డోనాల్డ్‌సన్) పాల్గొనడం విశేషంగా మారింది. చిత్ర బృందంతో కలిసి వేదికను పంచుకున్న మిస్టర్ బీస్ట్.. రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ‘జై శ్రీరామ్’ అని నినాదం చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమానికి సాయి పల్లవి, రవి దూబే, దర్శకుడు నితేష్ తివారీ , నిర్మాత నమిత్ మల్హోత్రా హాజరయ్యారు.

రణ్‌బీర్‌తో వేదికపై మిస్టర్ బీస్ట్.. శివధనుస్సు ఎత్తిన కథానాయకుడు

ఈవెంట్‌లో భాగంగా రణ్‌బీర్ కపూర్, మిస్టర్ బీస్ట్‌కు శ్రీరాముడి ఘనతను, భారతీయ సంస్కృతిలో రామాయణానికి ఉన్న విశిష్ట ప్రాముఖ్యతను వివరించారు. ఈ క్రమంలో రణ్‌బీర్ ప్రోత్సహించడంతో మిస్టర్ బీస్ట్ ఎంతో ఉత్సాహంగా ‘జై శ్రీరామ్’ అంటూ నినాదం చేశారు. సదరు దృశ్యాలను చూసిన ఆడిటోరియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా ఈలలు, కేరింతలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. అనంతరం వేదికపై రణ్‌బీర్ కపూర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీరాముడి పాత్రకు సూచికగా 'శివధనుస్సు' నమూనాను పైకి ఎత్తడం ఈవెంట్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

గ్లోబల్ మార్కెట్‌పై నమిత్ మల్హోత్రా దృష్టి.. హాలీవుడ్ స్థాయి ప్రమోషన్లు

రామాయణం లాంటి గొప్ప భారతీయ ఇతిహాసాన్ని కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లాలనే భారీ లక్ష్యంతో నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్న మిస్టర్ బీస్ట్‌ను ఈ చిత్ర ప్రచారంలో భాగస్వామిని చేశారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను అంతర్జాతీయ ప్రేక్షకులకు సైతం చేరువ చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని చిత్ర యూనిట్ వెల్లడించింది.

తారల దండకారణ్యం.. రెండు భాగాలుగా థియేటర్లలోకి

దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ భారీ పౌరాణిక చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తోంది. అలాగే కన్నడ స్టార్ హీరో యష్ రావణాసురుడి పాత్రలో మెరవనుండగా, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం (Part 1) 2026 నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. అలాగే రెండవ భాగాన్ని (Part 2) 2027లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.