Viral Video: అమ్మో రక్త పింజరి.. మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులకు చుక్కలు చూపించింది!

Viral Video: ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) మెట్రో లైన్ 3 స్టేషన్‌లో అత్యంత విషపూరితమైన రక్త పింజరి (Russell's Viper) పాము కలకలం సృష్టించింది.

Arun Chilukuri
Published on: 24 Jun 2026 11:59 AM IST
Viral Video
X

Viral Video: అమ్మో రక్త పింజరి.. మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులకు చుక్కలు చూపించింది!

Viral Video: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం జనజీవనంపైనే కాకుండా వన్యప్రాణులపైనా పడుతోంది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే బాంద్రా - కుర్లా కాంప్లెక్స్ (BKC) మెట్రో లైన్ 3 స్టేషన్‌లో అత్యంత విషపూరితమైన 'రక్త పింజరి' (Russell's Viper) పాము ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపింది. మెట్రో స్టేషన్ బేస్‌మెంట్‌లో కింద తిరుగుతున్న ఆ ప్రమాదకర సర్పఫాన్ని చూసి ప్రయాణికులు భయంతో అవాక్కయ్యారు.

సోమవారం ఉదయం సరిగ్గా 7:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వర్షాల కారణంగా తలదాచుకునేందుకు మెట్రో స్టేషన్ బేస్‌మెంట్‌లోకి ఈ రక్త పింజరి పాము వచ్చినట్లు భావిస్తున్నారు. ఆ సమయంలో ఆఫీసులకు వెళ్లే ప్రయాణికులతో స్టేషన్ రద్దీగా ఉంది. ఫ్లోర్‌పై పాము పాకడం గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు వేస్తూ అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన మెట్రో సిబ్బంది వన్యప్రాణి సంరక్షణ బృందానికి సమాచారం అందించారు.

సమాచారం అందిన వెంటనే స్నేక్ రెస్క్యూ సిబ్బంది మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. అత్యంత విషపూరితమైన పాము అయినప్పటికీ, వారు ఎంతో చాకచక్యంగా ఒక ఖాళీ నీళ్ల బాటిల్ సాయంతో దాన్ని లోపలికి వెళ్లేలా చేసి సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం దాన్ని జనావాసాలు లేని అటవీ ప్రాంతంలోకి తరలించారు.

ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "వర్షాలు మొదలయ్యాయి కదా.. పాములు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణిస్తాయి" అని ఒకరు కామెంట్ చేయగా.. "వర్షాకాలం అంటేనే పాముల కాలం, కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి" అంటూ మరికొందరు హెచ్చరిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story