School Love Letter: పుణ్యానికి పోతే పాపం ఎదురవడం అంటే ఇదే.. లవ్ లెటర్ రాసిన స్టూడెంట్‌ను మందలిస్తే!

School Love Letter: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తోటి విద్యార్థినికి లవ్ లెటర్ రాసిన నాలుగో తరగతి బాలుడిని మందలించిన ఉపాధ్యాయురాలిపై, బాలుడి కుటుంబం ఏకంగా రూ. 25 లక్షలు డిమాండ్ చేసింది.

Gagan kumar
Published on: 24 Sept 2026 2:34 PM IST
School Love Letter
X

School Love Letter: పుణ్యానికి పోతే పాపం ఎదురవడం అంటే ఇదే.. లవ్ లెటర్ రాసిన స్టూడెంట్‌ను మందలిస్తే!

Bright English School controversy: పుణ్యానికి పోతే పాపం ఎదురైందంటే ఇదే కాబోలు! తప్పుడు దారిలో వెళ్తున్న ఓ చిన్నారిని సన్మార్గంలో పెట్టాలని చూసిన ఆ పాఠశాల సిబ్బందికి ఊహించని షాక్ తగిలింది. తోటి విద్యార్థినికి లవ్ లెటర్ రాశాడని ఓ నాలుగో తరగతి బాలుడిని మందలించినందుకు, ఆ బాలుడి కుటుంబం ఏకంగా రూ. 25 లక్షలు పరిహారం డిమాండ్ చేసిన వింత ఘటన గుజరాత్ అహ్మదాబాద్‌లో వెలుగు చూసింది. అహ్మదాబాద్‌లోని 'బ్రైట్ ఇంగ్లీష్ స్కూల్'లో నాల్గో తరగతి చదువుతున్న ఓ బాలుడు, తోటి విద్యార్థినికి 'ఐ లవ్ యూ' అని రాసి ఉన్న చిరునవ్వుల నోట్ ఇచ్చాడు.

ఆ బాలిక భయపడిపోయి, ఏడుస్తూ ఆ విషయాన్ని ఉపాధ్యాయురాలు సీమా గోస్వామికి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా, కొంతకాలంగా కొందరు బాయ్స్ తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు ఆ నోట్‌ను చింపేసి బాలుడిని మందలించింది. సమస్య తీవ్రతను గమనించిన ప్రిన్సిపాల్, బాలుడి తల్లిని స్కూల్‌కు పిలిపించి మాట్లాడి పంపించారు. కొడుకును ఇంటికి తీసుకెళ్లిన తల్లి, కాసేపటికే తన బంధువులతో కలిసి మళ్లీ పాఠశాలకు వచ్చింది. ఉపాధ్యాయులు తమ కొడుకును తీవ్రంగా కొట్టారని, శరీరంపై గాయాలయ్యాయని ఆరోపించింది.

వెంటనే అంబులెన్స్ పిలిచి బాలుడిని ఆసుపత్రికి తరలించి, రామోల్ పోలీస్ స్టేషన్‌లో టీచర్ సీమా గోస్వామి, డైరెక్టర్ ఇంద్రజిత్ మౌర్యలపై ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా కేసు పెట్టకుండా ఉండాలంటే రూ. 25 లక్షలు ఇవ్వాలని, ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ. 5 లక్షలకు తగ్గించి పాఠశాల సిబ్బందిని బ్లాక్‌మెయిల్ చేయడం కలకలం రేపింది.

పాఠశాల డైరెక్టర్ ఇంద్రజిత్ మౌర్య ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అసలు బాలుడిని ఎవరూ కొట్టలేదని స్పష్టం చేశారు. ఆఫీస్ గది నుంచి బయటకు వచ్చిన ఆ బాలుడు ఎంతో సంతోషంగా కారిడార్‌లో పరిగెత్తుకెళ్తున్న దృశ్యాలు స్కూల్ సీసీటీవి కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయని తెలిపారు.

స్కూల్ పరువు పోకుండా ఉండేందుకు బాలుడి ఫీజు కూడా మాఫీ చేస్తామన్నా వారు వినలేదని వాపోయారు. అయితే విచారణ పారదర్శకంగా ఉండేందుకు టీచర్ సీమా గోస్వామిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రాథమిక వైద్య పరీక్షల్లో బాలుడికి ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదని పోలీసులు తేల్చారు.

సీసీటీవి ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. ఇలా చిన్నపాటి మందలింపును భూతద్దంలో చూపిస్తూ పాఠశాల యాజమాన్యాన్ని బెంబేలెత్తిస్తున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.