Gold: బంగారం ఎందుకు తుప్పు పట్టదు.? అసలు నిజం ఇదిగో

Gold: బంగారం ఎప్పటికీ ఎందుకు తుప్పు పట్టదు? వేల ఏళ్లు గడిచినా దాని మెరుపు ఎందుకు తగ్గదు.?

Ravi
By Ravi
Published on: 31 May 2026 12:31 PM IST
Gold
X

Gold: బంగారం ఎందుకు తుప్పు పట్టదు.? అసలు నిజం ఇదిగో

Gold: మన ఇళ్లలో ఇనుము కొన్నాళ్లకు తుప్పు పడుతుంది. వెండి నల్లబడుతుంది, రాగి పాత్రలు ఆకుపచ్చగా మారుతాయి. కానీ, వేల ఏళ్ల నాటి పాత బంగారం కూడా ఎప్పటికీ తన మెరుపును కోల్పోదు. వందల ఏళ్లు మట్టిలో పాతిపెట్టినా, సముద్రపు అడుగున మునిగిపోయినా బంగారం తుప్పు పట్టకుండా అలాగే ఉంటుంది. దీనికి కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ శతాబ్దాల మిస్టరీని అమెరికాలోని తులనే విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఛేదించారు.

ప్రసిద్ధ సైన్స్ జర్నల్ "ఫిజికల్ రివ్యూ లెటర్స్"లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం.. ఈ మాయాజాలం అంతా బంగారం అణువుల్లోనే దాగి ఉంది. మాథ్యూ మోంటెమోర్, శాంతు బిశ్వాస్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీనిపై లోతుగా పరిశోధనలు చేసింది. సాధారణంగా గాలిలోని ఆక్సిజన్ ఇతర లోహాలతో చర్య జరిపినప్పుడు అవి తుప్పు పడతాయి. కానీ బంగారం పైభాగంలో ఉండే అణువులు ఒక ప్రత్యేకమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటాయి.

అణువుల స్థాయిలో చూసినప్పుడు, బంగారం ఉపరితలం మీదున్న అణువులు చతురస్రాకారంలో కాకుండా తమను తాము దట్టంగా ఉండే "షడ్భుజి" ఆకృతిలోకి మార్చుకుంటాయి. దీన్నే 'స్ట్రక్చరల్ మెటామార్ఫోసిస్' అని అంటారు. ఈ షడ్భుజి ఆకారం ఎంత గట్టిగా ఉంటుందంటే.. ఆక్సిజన్ అణువులు దీన్ని ఛేదించి లోపలికి వెళ్లలేవు. గాలిలోని ఆక్సిజన్ విడిపోయి బంగారంతో కలవాలంటే మళ్లీ ఆ అణువులు పాత చతురస్రాకారంలోకి మారాల్సి ఉంటుంది, కానీ అది అంత సులభంగా జరిగే పని కాదు. ఒక్కవేళ ఈ అణువుల అమరిక గనుక జరగకపోతే, కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే బంగారం కూడా తుప్పు పట్టడం ఖాయమని పరిశోధకులు తేల్చి చెప్పారు.

ఈ ఆవిష్కరణ కేవలం మన ఆసక్తిని తీర్చడమే కాదు, భవిష్యత్తులో పరిశ్రమలకు ఎంతో మేలు చేయనుంది. ఈ అణువుల అమరికను గనుక శాస్త్రవేత్తలు కంట్రోల్ చేయగలిగితే.. రసాయన పరిశ్రమల్లో బంగారాన్ని ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా ఉపయోగించి ప్లాస్టిక్, పెయింట్స్ లాంటివి మరింత సులభంగా తయారు చేయవచ్చు. ఏది ఏమైనా, ప్రకృతి బంగారానికి ఇచ్చిన ఈ సహజ సిద్ధమైన అణువుల రక్షణ వల్లే, పసిడి తరతరాలుగా మనందరి ఫేవరెట్‌గా నిలిచిపోతోంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story