Dating App: డేటింగ్ యాప్ నడుపుతున్న ప్రభుత్వం.. జంటల కోసం సింగపూర్ బిగ్ ప్లాన్..
Dating App: సాధారణంగా మొబైల్‌లో డేటింగ్ యాప్ నోటిఫికేషన్ అనగానే టిండర్, హింజ్ లేదా బంబుల్ వంటి ప్రైవేట్ యాప్‌లు
Dating App: డేటింగ్ యాప్ నడుపుతున్న ప్రభుత్వం.. జంటల కోసం సింగపూర్ బిగ్ ప్లాన్..
Dating App: గుర్తుకొస్తాయి. కానీ, నేరుగా ప్రభుత్వమే ఒక డేటింగ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించి జంటలను కలిపే బాధ్యతను భుజాన వేసుకుంటే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆలోచనను సింగపూర్ ప్రభుత్వం ఆచరణలో పెట్టింది. ఆ దేశానికి చెందిన 'గవర్నమెంట్ టెక్నాలజీ ఏజెన్సీ' (GovTech) 'ఫస్ట్ డేట్' (FirstDate) పేరుతో ఒక ప్రత్యేకమైన మ్యాచ్ మేకింగ్ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసి ప్రయోగాత్మకంగా పరీక్షరిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సేవలను కేవలం 21 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు.
స్వైపింగ్ గొడవ లేదు.. 'సింగ్‌పాస్'తో పక్కా వెరిఫికేషన్
మిగిలిన వాణిజ్య డేటింగ్ యాప్‌లలాగా వందలాది ప్రొఫైళ్లను నిరంతరం స్వైప్ చేసుకుంటూ వెళ్లే విధానానికి భిన్నంగా 'ఫస్ట్ డేట్' పనిచేస్తుంది. ఇందులో వినియోగదారులు తమ ఆసక్తులు, జీవనశైలి, భావజాలానికి సంబంధించిన వివరాలతో ఒక ప్రశ్నాపత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఆ డేటా ఆధారంగా 'గేల్-షేప్లీ మ్యాచింగ్ అల్గారిథమ్' (Gale-Shapley algorithm) సహాయంతో ఒకేసారి ఒక్క ప్రొఫైల్‌ను మాత్రమే వినియోగదారుడికి చూపిస్తుంది. ఆ మ్యాచ్‌ను అంగీకరించాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి 72 గంటల సమయం ఇస్తారు. ఆన్‌లైన్ డేటింగ్‌లో ఎదురయ్యే నకిలీ ప్రొఫైళ్ల సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు, సింగపూర్ జాతీయ డిజిటల్ గుర్తింపు వ్యవస్థ అయిన 'సింగ్‌పాస్' (Singpass) ద్వారా వినియోగదారుల వివరాలను ప్రభుత్వం పక్కాగా నిర్ధారిస్తుంది.
సింగపూర్ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?
ప్రభుత్వమే స్వయంగా మ్యాచ్ మేకర్‌గా మారడానికి అక్కడ వేగంగా క్షీణిస్తున్న జనాభా గణాంకాలే ప్రధాన కారణం. సింగపూర్‌లో సంతానోత్పత్తి రేటు చారిత్రాత్మక కనిష్టానికి పడిపోయింది. గతంలో ఒక మహిళకు సగటున 0.97గా ఉన్న ఫెర్టిలిటీ రేటు గణనీయంగా తగ్గిపోవడంతో పాటు, జననాల సంఖ్యలో కూడా భారీ కోత నమోదైంది.
మరోవైపు పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య కూడా తగ్గిపోతుండగా, వివాహ సమయానికి వధూవరుల సగటు వయస్సు పెరిగిపోతోంది. ఒంటరిగా జీవించే కుటుంబాల సంఖ్య పెరుగుతుండటంతో దేశం వేగంగా వృద్ధాప్యం వైపు అడుగులేస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు, గతంలో సత్ఫలితాలనిచ్చిన 'సోషల్ డెవలప్‌మెంట్ యూనిట్' లాంటి సామాజిక కార్యక్రమాలను పునరుద్ధరిస్తూ, డిజిటల్ యుగానికి అనుగుణంగా అల్గారిథమ్‌లతో కూడిన ఈ 'ఫస్ట్ డేట్' యాప్‌ను తెరపైకి తెచ్చారు.
టోక్యో, దక్షిణ కొరియా దారిలోనే సింగపూర్
ప్రభుత్వమే జోక్యం చేసుకుని పౌరుల మధ్య అనుబంధాలను ప్రోత్సహించడం సింగపూర్‌కే పరిమితం కాలేదు. తీవ్ర నిరాశజనకమైన జననాల రేటుతో బాధపడుతున్న పలు ఆసియా దేశాలు ఇప్పటికే ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నాయి. జపాన్‌లోని టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం 'టోక్యో ఎన్ముసుబి' పేరుతో 2024లో స్వంత డేటింగ్ సేవలను ప్రారంభించగా, దీని ద్వారా అనేక జంటలు వివాహబంధంలోకి అడుగుపెట్టాయి.
అలాగే దక్షిణ కొరియా ప్రభుత్వం కూడా పడిపోతున్న జనాభా రేటును అదుపు చేసేందుకు సాంకేతికతను, ప్రభుత్వ నిధులతో కూడిన మ్యాచ్ మేకింగ్ కార్యక్రమాలను విస్తృతంగా ప్రోత్సహిస్తోంది.




