Viral News : “దేవుడే ఈ దేశాన్ని కాపాడాలి”.. ఎందుకంటే.?
Viral News : ప్రసిద్ధ కళాకారిణి, బిజెపి ఎంపీ తేజస్వి సూర్య సతీమణి శివశ్రీ స్కందప్రసాద్‌కు ఇటీవల రైలు ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. తన ప్రయాణంలో..
Sivasri Skandaprasad
Viral News : ప్రసిద్ధ కళాకారిణి, బిజెపి ఎంపీ తేజస్వి సూర్య సతీమణి శివశ్రీ స్కందప్రసాద్‌కు ఇటీవల రైలు ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. తన ప్రయాణంలో కొంతమంది ప్రయాణికులు ప్రవర్తించిన తీరుపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ "ఎక్స్" (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ చేశారు. తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఈ సంఘటనను ఆమె "అత్యంత వేదనకు గురిచేసిన అనుభవం"గా అభివర్ణించారు.
రైలులో 5 గంటల పాటు రచ్చ
తన ప్రయాణంలో 56 సీట్లు ఉన్న కోచ్‌లో దాదాపు 40 మంది ఉన్న ఒక గుంపు పెద్దగా అరుస్తూ, మాట్లాడుకుంటూ తోటి ప్రయాణికుల వ్యక్తిగత ప్రశాంతతను దెబ్బతీశారని శివశ్రీ పేర్కొన్నారు. సుమారు ఐదు గంటల పాటు ఎలాంటి విరామం లేకుండా ఆ నలుగురి ప్రవర్తన కొనసాగిందని తెలిపారు. ఒక కళాకారిణిగా తనకు ప్రశాంతమైన వాతావరణం అవసరమని, పబ్లిక్ స్పేస్‌లలో తోటివారిని ఇబ్బంది పెట్టకుండా ఎలా ప్రవర్తించాలో ప్రజలు తెలుసుకోవాలని హితవు పలికారు.
ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి
మన దేశంలో ఇలాంటి ప్రవర్తనను ఎవరూ ప్రశ్నించకపోవడమే పెద్ద సమస్యగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్‌లో లేని మిగతా 16 మంది ప్రయాణికులు కూడా ఆ శబ్దాన్ని భరించక తప్పలేదని, ప్రశ్నిస్తే ఏమవుతుందోనన్న భయంతో మౌనంగా ఉండిపోయారని రాసుకొచ్చారు.
TTE కి ఫిర్యాదు.. ప్రయాణికుల వెటకారం
సహనం నశించిన శివశ్రీ ఈ విషయంపై టీటీఈ (TTE) కి ఫిర్యాదు చేసి, వేరే కోచ్‌లోకి సీటు మార్చమని కోరారు. అయితే రైలు నిండిపోవడంతో అదే కోచ్‌లో మరో సీటు కేటాయించారు. ఆ తర్వాత కూడా ఆ గుంపు UNO కార్డ్ గేమ్ ఆడుతూ, అలజడి సృష్టించడంతో ఆమె మళ్లీ టీటీఈ దృష్టికి తీసుకెళ్లారు. టీటీఈ వచ్చి వారిని ఆడవద్దని కోరినప్పటికీ, కాసేపటి తర్వాత మళ్లీ వచ్చి వెటకారంగా మాట్లాడటంతో ఆ ప్రయాణికులు నవ్వుతూ టీటీఈని కూడా ఆటకు ఆహ్వానించారని శివశ్రీ తెలిపారు. ఆ తర్వాత వారు కావాలనే బాలీవుడ్ పాటలు ప్లే చేస్తూ మరింత ఇబ్బంది పెట్టారని ఆమె ఆరోపించారు.
సివిక్ సెన్స్ ఓడిపోయింది
ఈ ఘటన కార్డ్ గేమ్‌కు సంబంధించినది కాదని, పబ్లిక్ స్పేస్‌లలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో తెలియజేసే పౌర స్పృహకు సంబంధించినదని ఆమె స్పష్టం చేశారు. "ఈ ఘటనలో ఎవరు గెలిచారనేది ముఖ్యం కాదు, భారతీయులుగా మేమంతా పౌర స్పృహ విషయంలో ఓడిపోయాం" అని ఆమె వ్యాఖ్యానించారు. మన దేశంలో ప్రజలు పబ్లిక్ బిహేవియర్ ని ఎప్పుడు మెరుగుపరుచుకుంటారో అని ప్రశ్నిస్తూ, "దేవుడే ఈ దేశాన్ని కాపాడాలి" అని తన పోస్ట్‌ను ముగించారు. శివశ్రీ షేర్ చేసిన ఈ పోస్ట్‌కు ఎక్స్‌లో విశేష స్పందన లభించగా, లక్షకు పైగా వీక్షణలు వచ్చాయి. అయితే ఈ ఘటనపై రైల్వే అధికారుల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.




