Viral News : పాము కాటేసిందని.. చంపి సంచిలో పెట్టుకుని హాస్పిటల్‌కు తెచ్చి..
Viral News : పాము కనిపించగానే భయంతో దూరంగా పరుగులు తీసేవాళ్లను చూసుంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఒక విచిత్రమైన, షాకింగ్ సంఘటన..
Viral News : పాము కనిపించగానే భయంతో దూరంగా పరుగులు తీసేవాళ్లను చూసుంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఒక విచిత్రమైన, షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. నిద్రపోతున్న సమయంలో తన్ను కాటేసిన ఒక భారీ పామును ఓ 60 ఏళ్ల వృద్ధుడు కర్రతో కొట్టి చంపేశాడు. అంతటితో ఆగకుండా, మరుసటి రోజు ఉదయాన్నే ఆ చనిపోయిన పామును ఒక సంచిలో వేసుకుని నేరుగా జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడ ఉన్న వైద్యులకు చూపించాడు. ఈ వింత ఘటనను చూసి ఆసుపత్రి సిబ్బంది, ఇతర రోగులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
పొలంలో నిద్రపోతుండగా ఊహించని కాటు
బాధితుడు ఉత్తమ్ నాయక్ (60) తన పొలంలో ఉన్న టీన్ షెడ్ కింద అర్ధరాత్రి నిద్రపోతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. హఠాత్తుగా కుడిచేతి వేలిపై తీవ్రమైన నొప్పి, మంట అనిపించడంతో ఆయన నిద్రలేచాడు. వెంటనే టార్చ్ లైట్ వేసి చూడగా, పొయ్యి దగ్గర సుమారు 5 అడుగుల పొడవున్న నల్లటి పాము కనిపించింది. నొప్పితో రగిలిపోయిన ఉత్తమ్ నాయక్, ఏమాత్రం భయపడకుండా పక్కనే ఉన్న ఒక కర్రను తీసుకుని ఆ పాము చనిపోయే వరకు విచక్షణారహితంగా దాడి చేశాడు.
టీ తాగి ప్రశాంతంగా తెల్లవారే వరకు ఎదురుచూపులు
పామును చంపిన తర్వాత ఉత్తమ్ నాయక్ ప్రదర్శించిన నిగ్రహం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాటు వేసిన వేలికి తనే స్వయంగా కట్టు కట్టుకుని, ప్రశాంతంగా టీ తాగి తెల్లవారే వరకు పొలంలోనే వేచి చూశాడు. ఉదయం 5 గంటల సమయంలో చనిపోయిన పామును ఒక సంచిలో వేసుకుని ఇంటికి చేరుకున్నాడు. రాత్రి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు తీవ్రంగా భయాందోళన చెందారు.
ఆసుపత్రిలో ప్రత్యక్షమైన చచ్చిన పాము.. డాక్టర్లు షాక్
కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను మహోబా జిల్లా ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అయితే, ఆసుపత్రికి వచ్చిన ఉత్తమ్ నాయక్ తన వెంట తెచ్చిన సంచిలోంచి ఆ చనిపోయిన పామును బయటకు తీసి డాక్టర్లకు చూపించాడు. "నన్ను కాటేసింది ఈ పామే, ఇది విషపూరితమైనదో కాదో ఒకసారి చూడండి డాక్టర్" అని కోరడంతో అక్కడున్న డాక్టర్లు, సిబ్బంది ఒక్కసారిగా విస్తుపోయారు.
ప్రమాదం నుంచి బయటపడ్డ వృద్ధుడు
ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవీన్ చౌహాన్ వెంటనే ఉత్తమ్ నాయక్‌ను పరీక్షించి చికిత్స ప్రారంభించారు. ప్రాథమిక తనిఖీల అనంతరం ఆయన శరీరంలో ఎలాంటి విషలక్షణాలు లేవని వైద్యులు నిర్ధారించారు. పాము ఒక్కసారి మాత్రమే కాటు వేయడం, అది విషపూరితం కాకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. ప్రస్తుతం ఉత్తమ్ నాయక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండి ప్రమాదం నుంచి బయటపడినట్లు వైద్యులు వెల్లడించారు.




