Snake Bite: వెండితెరపై వింతలు.. నిజ జీవితంలో ఘోరాలు.. భర్తను కాపాడే ఆరాటంలో ప్రాణాల మీదకు..

Snake Bite: సినిమా ఇండస్ట్రీ సృష్టించే కొన్ని భ్రమలు నిజ జీవితంలో ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ.

G Krishna
Published on: 12 July 2026 6:54 PM IST
Snake Venom
X

Snake Venom

Snake Bite: సినిమా ఇండస్ట్రీ సృష్టించే కొన్ని భ్రమలు నిజ జీవితంలో ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. సాధారణంగా సినిమాల్లో హీరోకో, హీరోయిన్‌కో పాము కరిస్తే.. పక్కనే ఉన్నవారు వెంటనే తమ నోటితో ఆ విషాన్ని బయటకు పీల్చి ఉమ్మేయడం మనం చూస్తుంటాం. ఆ తర్వాత బాధితులు క్షేమంగా లేచి కూర్చోవడం కూడా రీల్ లైఫ్‌లో సర్వసాధారణం. అయితే, ఇదే సీన్‌ను రియల్ లైఫ్‌లో అప్లై చేసిందో మహిళ. పాము కాటుకు గురైన తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలనే ఆరాటంలో.. అతని శరీరంలోని విషాన్ని తన నోటితో పీల్చేసింది. ఫలితం.. ఆమె ఊహించినదానికి భిన్నంగా, ఆ సినిమా ట్రిక్ ఆమెను సైతం మృత్యు ముఖంలోకి నెట్టింది. ఈ షాకింగ్ ఘటన చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.

భర్త కోసం ప్రాణాల పణంగా..

అక్కడ నివసించే ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటుండగా హఠాత్తుగా ఒక నాగుపాము అతడిని కాటు వేసింది. ఆ సమయంలో అతని భార్య కూడా పక్కనే ఉంది. పాము కరిచిన కొద్దిసేపటికే భర్త వేలు విపరీతంగా వాచిపోయి, కళ్లు తిరుగుతూ కిందపడిపోయాడు. భర్త ప్రాణాపాయ స్థితిని చూసి తీవ్ర ఆందోళనకు గురైన ఆ భార్య, సినిమాల్లో చూసిన ట్రిక్కును వాడింది. ఏమాత్రం ఆలోచించకుండా భర్తకు పాము కరిచిన చోట నోరు పెట్టి విషాన్ని బయటకు పీల్చడం ప్రారంభించింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వెంటనే ఆ రైతును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మొదట్లో భార్యకు ఏమీ కానట్లే అనిపించినా, అసలు ప్రమాదం ఆ తర్వాతే మొదలైంది.

కొన్ని గంటల్లోనే సీన్ రివర్స్..

భర్తకు డాక్టర్లు చికిత్స అందిస్తున్న సమయంలోనే, కొన్ని గంటల తర్వాత ఆ మహిళ ఆరోగ్యం కూడా వేగంగా క్షీణించడం ప్రారంభమైంది. మొదట ఆమె నోరు, నాలుక మొద్దుబారిపోయాయి. క్రమంగా ముఖం, చేతులు, కాళ్లు కూడా స్పర్శ కోల్పోయాయి. మరుసటి రోజు నాటికి పరిస్థితి మరింత దారుణంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆమెను కూడా అదే ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. ఇద్దరినీ పరీక్షించిన వైద్యులు.. భార్యాభర్తలిద్దరూ పాము విషం బారిన పడ్డారని తేల్చారు. వెంటనే ఇద్దరికీ అత్యవసరంగా యాంటీ వేనమ్ ఇంజెక్షన్లు ఇచ్చి చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ సకాలంలో సరైన వైద్యం అందడంతో కొద్దిరోజుల తర్వాత ఇద్దరూ కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

వైద్యుల హెచ్చరిక..

ఈ ఘటనపై వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. సినిమాల్లో చూపించే ఇలాంటి స్టంట్స్ నిజ జీవితంలో చేయడం ముమ్మాటికీ ఆత్మహత్యాసదృశ్యమని స్పష్టం చేశారు. మన నోటి లోపల ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుందని, అక్కడ ఉండే చిన్న చిన్న రక్తనాళాల ద్వారా పాము విషం క్షణాల్లో శరీరంలోలోకి, రక్తప్రవాహంలోకి శోషించబడుతుందని వివరించారు. ఒకవేళ నోట్లో చిన్నపాటి పుండ్లు, పంటి సమస్యలు లేదా చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్యలు ఉంటే.. విషం నేరుగా ప్రాణాలకే ముప్పు తెస్తుందని హెచ్చరించారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story