Reverse Psychology: కొనొద్దు బాబోయ్ అంటున్నాడు.. అయినా ఎగబడి కొంటున్నారు!

Reverse Psychology: ‘‘ఇవి నాసిరకం స్కార్ఫులు, అసలు కొనొద్దు’’ అంటూ రివర్స్ సైకాలజీతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న దక్షిణ కొరియా వ్యాపారి ‘స్కార్ఫ్ మ్యాన్’ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.

Arun Chilukuri
Published on: 16 Nov 2026 11:09 AM IST
Reverse Psychology
X

Reverse Psychology: కొనొద్దు బాబోయ్ అంటున్నాడు.. అయినా ఎగబడి కొంటున్నారు!

Reverse Psychology: సాధారణంగా వ్యాపారులు తమ వస్తువులను అమ్ముకోవడానికి ‘మా దగ్గర ఉన్నవి చాలా నాణ్యమైనవి, తక్కువ ధరకే వస్తాయి, తప్పకుండా కొనండి’ అని ప్రచారం చేస్తుంటారు. కానీ, దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఓ వ్యాపారి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సియోల్‌ టవర్‌ వద్ద చిన్న దుకాణం నడుపుతున్న ‘స్కార్ఫ్‌ మ్యాన్‌’ తన వ్యాపారంలో తెలివిగా ‘రివర్స్‌ సైకాలజీ’ని వాడుతూ కాసుల వర్షం కురిపించుకుంటున్నాడు.

చిన్న పిల్లలకు ఏది వద్దని చెబుతామో అదే కావాలని మారాం చేస్తారు. నిజానికి కొంతమంది పెద్దవాళ్లలోనూ ఇదే మొండి ధోరణి ఉంటుంది. సరిగ్గా ఇదే మానసిక సూత్రాన్ని ‘స్కార్ఫ్‌ మ్యాన్‌’ తన బిజినెస్ ట్రిక్‌గా మార్చుకున్నాడు. దక్షిణ కొరియా సంస్కృతిలో స్కార్ఫులకు (ఉత్తరీయాలకు) చాలా ప్రాధాన్యం ఉంటుంది. తాను విక్రయించే స్కార్ఫులపై ఇతడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటాడు. ఆ వీడియోల్లో.. ‘‘ఇవి బొత్తిగా నాసిరకం.. అసలు కొనొద్దు. అయినా ఇప్పుడివి అవసరమా?’’ అంటూ కస్టమర్లను వారించినట్లుగా మాట్లాడతాడు.

వీడియోల మధ్యమధ్యలో అతడు వేసే చమత్కారాలు, హావభావాలకు నెటిజన్లలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతడి వీడియోలు చూసి, ఆ వింత వ్యాపారిని ఒకసారి ప్రత్యక్షంగా చూద్దామని సియోల్ టవర్ వద్దనున్న ఆ చిన్న దుకాణానికి వినియోగదారులు పోటెత్తుతున్నారు. ఫలితంగా ఇటీవల అతడి దుకాణానికి వచ్చిన కొత్త స్టాక్ మొత్తం కేవలం 24 గంటల్లోనే హాట్‌కేకుల్లా అమ్ముడుపోయింది. కొనొద్దని చెబుతూనే కస్టమర్లను క్యూ కట్టిస్తున్న ఈ వ్యాపారి మార్కెటింగ్ చిట్కా నిజంగా భలే ఉంది కదూ!

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.