Varalakshmi Vratham: శ్రావణ మాసంలో అమ్మవారికి ఏ నివేదనలంటే ఇష్టం? ఉపవాసం వెనుక ఉన్న అసలైన పరమార్థం ఏమిటి..?

Sravana Masam, Varalakshmi Vratham: శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజ, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారికి రకరకాల నివేదనలు అర్పిస్తుంటారు.

Venkat
Published on: 6 Aug 2026 9:24 PM IST
Varalakshmi Vratham
X

Varalakshmi Vratham: శ్రావణ మాసంలో అమ్మవారికి ఏ నివేదనలంటే ఇష్టం? ఉపవాసం వెనుక ఉన్న అసలైన పరమార్థం ఏమిటి..?

Sravana Masam, Varalakshmi Vratham: శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం అనగానే నివేదనలు, ఉపవాసాలపై అనేక అనుమానాలు రావడం సహజం. అమ్మవారికి ఎలాంటి ప్రసాదాలు సమర్పించాలి? అసలు ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడమేనా? పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి మాతాజీ చెప్పిన ఆసక్తికర ఆధ్యాత్మిక విషయాలు ప్రతీ ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి.

అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఇవే..

శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజ, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారికి రకరకాల నివేదనలు అర్పిస్తుంటారు. దేవీ ఉపాసనలో పాలతో తయారు చేసిన పదార్థాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. క్షీరాన్నం, పాలకోవ, చక్రపొంగలితో పాటు చల్లని దద్దోజనం అమ్మవారికి అత్యంత ప్రీతికరం. ప్రాంతాలను బట్టి బూరెలు, పూర్ణాలు, బొబ్బట్లు, భక్ష్యాలు అని రకరకాల పేర్లతో పిలిచే తీపి వంటకాలను నివేదిస్తారు.

పులిహోర విషయానికి వస్తే నిమ్మకాయతో కంటే చింతపండుతో చేసిన పులిహోరనే అమ్మవారికి శ్రేష్టమైనదిగా భావిస్తారు. అదే విధంగా పెసరపప్పు, జీలకర్ర, చిటికెడు ఉప్పు, పసుపు వేసి వండే పులగాన్నం (ముగ్గోదనము) దేవికి చాలా ఇష్టమైన నైవేద్యం. పెద్ద పెద్ద వంటలు చేయలేకపోయినా, రోజూ పులగం వండి కొద్దిగా బెల్లం, నెయ్యి, పెరుగు కలిపి నివేదిస్తే చాలు దేవి అనుగ్రహం లభిస్తుంది. అలసిపోకుండా, పూజకు అంతరాయం కలగకుండా భక్తితో సమర్పించే అప్పాలు, పాకం గారెలు, గవ్వలు, తీపి పూరీలు కూడా అమ్మ స్వీకరిస్తుంది.

ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు..!

పండుగ రోజుల్లో చాలామంది రోజంతా ఏమీ తినకుండా కఠిన ఉపవాసాలు ఉంటారు. భగవంతుడికి నైవేద్యం పెట్టాక ప్రసాదాన్ని స్వీకరించకపోవడం సరైన పద్ధతి కాదని చెబుతుంటారు. ఉపవాసం అనే పదానికి అసలైన అర్థం భగవంతుడికి దగ్గరగా ఉండటం. 'ఉప' అంటే దగ్గరగా, 'వాసము' అంటే నివసించడం. నిరంతరం దైవ నామస్మరణతో భగవంతుడి సాన్నిధ్యంలో గడపడమే నిజమైన ఉపవాసం.

అతిగా తింటే నిద్ర, బద్ధకం వచ్చి జపానికి భంగం కలుగుతుందనే ఉద్దేశంతోనే ఆహార నియమాలు పెట్టారు. కొద్దికొద్దిగా ప్రసాదం తింటూ, శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తూ నామస్మరణ చేయాలి. శరీరం నీరసించిపోతే ఒక శ్లోకం కూడా చదవలేని పరిస్థితి వస్తుంది. కడుపు మార్చుకుని అలసిపోవడం కంటే ప్రసాదాన్ని స్వీకరించి ఆనందంగా పూజ చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం.

భయం వద్దు.. అమ్మవారిలో ఉన్నది అమితమైన వాత్సల్యం..!

పూజ విషయంలో చాలామందిలో ఒకవిధమైన భయం నెలకొంది. ఏ చిన్న పొరపాటు జరిగినా అమ్మవారికి కోపం వస్తుందేమోనని భయపడుతుంటారు. లలితా దేవి అమితమైన సౌమ్యురాలు, జగన్మాత. కంటికి కనిపించే చీమ నుంచి ప్రతి జీవి ఆవిడ సంతానమే. మహిషాసురుడిని సంహరించే సమయంలో కూడా తన బిడ్డ దారికి రాలేదే అనే బాధతోనే దేవి ఆ కార్యాన్ని పూర్తి చేసింది తప్ప కోపంతో కాదు.

పూజ చేసేవారికి, దేవిని ఆరాధించేవారికి కోపం, అహంకారం వంటి దుర్గుణాలు ఉండకూడదు. అమ్మవారిని ఆశ్రయిస్తే మనలోని అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది. మనసులోని చెడు భావాలను వదిలేసి, ప్రశాంతంగా, చిరునవ్వుతో పూజలో పాల్గొనడమే నిజమైన భక్తి.

ప్రసాదం పంపిణీ, విగ్రహారాధన పరమార్థం..

దేవుడికి నివేదించిన ప్రసాదాన్ని కేవలం ఇంట్లో వారే తినాలనే నియమం ఏదీ లేదు. ఇంటికి వచ్చిన ప్రతిఒక్కరికీ, తాంబూలం కోసం వచ్చిన పుణ్యస్త్రీలకు ప్రసాదం పంచి పెట్టడమే అసలైన ధర్మం. ఎంతమందికి పంచి భుజిస్తే దాని ప్రాశస్త్యం అంతగా పెరుగుతుంది.

విగ్రహారాధన మనకు స్థితప్రజ్ఞతను నేర్పుతుంది. మనం సుఖంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా విగ్రహం పెదవులపై సదా ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ, చిరునవ్వుతో ముందుకు సాగాలనే గొప్ప సందేశాన్ని విగ్రహారాధన ఇస్తుంది.

శ్రావణ మాసంలో ఆడంబరాల కంటే నిశ్చలమైన భక్తి, ప్రశాంతమైన మనసే ముఖ్యమైనవి. దేవికి ప్రేమతో సమర్పించే చిన్న నైవేద్యమైనా అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తుంది. భయాన్ని వీడి, ఆనందంతో అమ్మవారిని పూజించి దైవానుగ్రహం పొందుదాం.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story