Viral Video: తమ్ముడిని కాపాడేందుకు ఫస్ట్ ఫ్లోర్ నుండి దూకేసిన అన్న.. ఒళ్ళు గగుర్పొడిచే కుక్క దాడి వీడియో వైరల్!
Kerala: కేరళలోని మలప్పురంలో వీధి కుక్క ముగ్గురిపై జరిపిన దాడి ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది.
Viral Video: తమ్ముడిని కాపాడేందుకు ఫస్ట్ ఫ్లోర్ నుండి దూకేసిన అన్న.. ఒళ్ళు గగుర్పొడిచే కుక్క దాడి వీడియో వైరల్!
Kerala: దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. రోడ్లపై వెళ్లే వారు, ఇళ్ల ముందు ఆడుకునే చిన్నారులు ఎప్పుడు ఏ శునకానికి బలైపోతారో తెలియని భయాందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా కేరళలోని మలప్పురం జిల్లాలో ఒక పిచ్చి కుక్క ముగ్గురిపై ఏకధాటిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘోర ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ భీకర దాడికి సంబంధించిన దృశ్యాలు స్థానిక ఇంటి సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయ్యి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మలప్పురం జిల్లా చంగరంకుళంలోని అలంకోడ్‌లో ఒక ఇంటి ప్రాంగణంలో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక వీధి కుక్క ఒక చిన్నారిపై ఒక్కసారిగా విరుచుకుపడింది. బాలుడిని కింద పడేసి నడుము, కాళ్ల భాగాల్లో విచక్షణారహితంగా కరవడం ప్రారంభించింది. చిన్నారి భయంతో కేకలు వేయడం గమనించిన అతని అన్న.. ఏమాత్రం ఆలోచించకుండా తమ్ముడిని కాపాడాలనే ఆరాటంతో ఏకంగా మొదటి అంతస్తు (First Floor) గ్యాలరీ నుండి కిందకు దూకేశాడు. ప్రాణాలకు తెగించి ఆ కుక్కతో పోరాడి తమ్ముడిని దాని బారి నుండి రక్షించాడు.
అనంతరం ఆ కుటుంబానికి చెందిన ఒక మహిళ చిన్నారులను సురక్షితంగా ఇంట్లోకి తీసుకెళ్లగా.. సదరు యువకుడు ఆ పిచ్చి కుక్కను ఇంటి ఆవరణ నుండి వెళ్లగొట్టేందుకు పెద్ద కర్రతో దాని వెంట పడ్డాడు. అయితే, కొంత దూరం వెళ్లిన ఆ శునకం మరింత రెచ్చిపోయి ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆ యువకుడిపైనే ఎదురుదాడికి దిగింది. అతన్ని కూడా కింద పడేసి దారుణంగా కరవడంతో.. యువకుడు అతికష్టం మీద పైకి లేచి కర్రతో బలంగా కొట్టాడు. దీంతో ఆ కుక్క అక్కడికక్కడే కుప్పకూలింది.
కానీ నిమిషాల వ్యవధిలోనే మళ్లీ తేరుకున్న ఆ పిచ్చి కుక్క.. రోడ్డుపై వెళ్తున్న మరొక అమాయక వ్యక్తిపై దాడి చేసి కిందపడేసి కొరికేసింది. కుక్క ఆగడాలు మితిమీరిపోవడంతో, ఆ యువకుడు వెంటనే రోడ్డుపైకి పరిగెత్తుకెళ్లి, పెద్ద కర్రతో దాని తలపై పదేపదే బలంగా కొట్టి అక్కడికక్కడే చంపేశాడు.
ఈ దాడిలో గాయపడిన ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ్ముడి ప్రాణాలు కాపాడటం కోసం ఏకంగా మొదటి అంతస్తు నుండి కిందకు దూకి, చివరి వరకు పోరాడిన ఆ అన్న తెగువను చూసి నెటిజన్లు సాల్యూట్ చేస్తున్నారు. "నిజమైన హీరో" అంటూ అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు, ఈ భయంకర వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు.




