SSY: రోజుకు రూ.50 పొదుపుతో కుమార్తె భవిష్యత్తుకు రూ.8 లక్షలకు పైగా ఫండ్..
SSY: కుమార్తె భవిష్యత్తు కోసం సురక్షితమైన పెట్టుబడి పెట్టాలని భావించే తల్లిదండ్రులకు సుకన్య సమృద్ధి యోజన (SSY) ఉత్తమ ఎంపికగా చెప్పొచ్చు.
SSY: రోజుకు రూ.50 పొదుపుతో కుమార్తె భవిష్యత్తుకు రూ.8 లక్షలకు పైగా ఫండ్..
SSY: కుమార్తె భవిష్యత్తు కోసం సురక్షితమైన పెట్టుబడి పెట్టాలని భావించే తల్లిదండ్రులకు సుకన్య సమృద్ధి యోజన (SSY) ఉత్తమ ఎంపికగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 8.2 శాతం వార్షిక వడ్డీ అందుతోంది. రోజుకు కేవలం రూ.50 పొదుపు చేసినా, మెచ్యూరిటీ సమయానికి రూ.8 లక్షలకు పైగా నిధి సమకూరే అవకాశం ఉంటుంది.
ఎవరు ఖాతా తెరవొచ్చు? ఎంత పెట్టుబడి పెట్టాలి?
సుకన్య సమృద్ధి యోజనలో 10 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న బాలిక పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఖాతా తెరవవచ్చు. ఒక బాలికకు ఒకే ఖాతా అనుమతిస్తారు. ఈ పథకంలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ పథకం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండటంతో పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. అలాగే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
రోజుకు రూ.50 పొదుపుతో రూ.8 లక్షలకు పైగా ఎలా వస్తాయి?
రోజుకు రూ.50 చొప్పున పొదుపు చేస్తే నెలకు సుమారు రూ.1,500, ఏడాదికి రూ.18,000 పెట్టుబడి అవుతుంది. ఈ మొత్తాన్ని వరుసగా 15 సంవత్సరాల పాటు జమ చేస్తే మొత్తం పెట్టుబడి రూ.2,70,000 అవుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 8.2 శాతం వడ్డీ ప్రకారం మెచ్యూరిటీ సమయానికి ఈ పెట్టుబడిపై సుమారు రూ.5,61,309 వడ్డీ లభిస్తుంది. అంటే మొత్తం కలిపి రూ.8,31,309 వరకు నిధి సిద్ధమవుతుంది. అయితే ప్రభుత్వం కాలానుగుణంగా వడ్డీ రేట్లను సవరిస్తుంది కాబట్టి, మెచ్యూరిటీ సమయానికి అందే మొత్తం అప్పటి వడ్డీ రేట్లపై ఆధారపడి మారే అవకాశం ఉంటుంది.
ఈ పథకం ప్రత్యేకతలు ఏమిటి?
సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ హామీతో కూడిన పథకం కావడంతో మార్కెట్ ఒడిదొడుకుల ప్రభావం ఉండదు. ఇతర చిన్న పొదుపు పథకాలతో పోలిస్తే ప్రస్తుతం అధిక వడ్డీ అందిస్తోంది. అంతేకాదు, పెట్టుబడి చేసిన మొత్తానికి, వచ్చిన వడ్డీకి, మెచ్యూరిటీ సమయంలో తీసుకునే మొత్తానికి కూడా నిబంధనల ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది. అందుకే కుమార్తె భవిష్యత్తు కోసం రిస్క్ లేకుండా దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ పథకం మంచి ఎంపికగా మారింది.
ఖాతా ఎప్పుడు మూసివేయొచ్చు? నిబంధనలు ఏంటి?
సాధారణ పరిస్థితుల్లో ఈ ఖాతాను మెచ్యూరిటీకి క్లోజ్ చేయడానికి అవకాశం ఉండదు. అయితే అకౌంట్ ప్రారంభమైన తర్వాత ఐదేళ్లు పూర్తైన అనంతరం, ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఖాతాను మూసివేయడానికి అనుమతి ఉంటుంది. ఒకవేళ ఖాతాదారైన బాలిక దురదృష్టవశాత్తు మరణిస్తే, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు అవసరమైన పత్రాలను సమర్పించాలి.
అనంతరం ఖాతాలో ఉన్న మొత్తం డిపాజిట్‌తో పాటు, మరణించిన తేదీ వరకు వచ్చిన వడ్డీని వారికి చెల్లిస్తారు. అయితే మరణించిన తేదీ నుంచి ఖాతా అధికారికంగా మూసివేసే వరకు ఉన్న కాలానికి సుకన్య సమృద్ధి వడ్డీ కాకుండా, పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాకు వర్తించే వడ్డీ మాత్రమే చెల్లిస్తారు.




