Viral Video: దొంగతనంలోనూ నిజాయితీ.. సైకిల్ ఇచ్చేసి క్షమాపణలు కోరిన మహిళ!

Viral Video: గుజరాత్‌లోని సూరత్‌లో వింత దొంగతనం! ఒక మహిళ సైకిల్‌ను దొంగిలించి, మరుసటి రోజే తిరిగి ఇచ్చేసింది.

Arun Chilukuri
Published on: 18 Jun 2026 10:26 AM IST
Viral Video
X

Viral Video: దొంగతనంలోనూ నిజాయితీ.. సైకిల్ ఇచ్చేసి క్షమాపణలు కోరిన మహిళ!

Viral Video: సాధారణంగా దొంగతనం జరిగిన వస్తువులు తిరిగి దొరకడం చాలా అరుదు. దొంగలు దొరికినా సొమ్ము దొరకడం కష్టం. కానీ, గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఒక వింత దొంగతనం జరిగింది. ఒక మహిళ సైకిల్‌ను దొంగిలించి, ఆ తర్వాత పశ్చాత్తాపంతో మరుసటి రోజే దానిని తిరిగి యజమాని ఇంటికి తెచ్చి ఇచ్చేసింది. అంతేకాకుండా, అక్కడ ఉన్న నిఘా కెమెరా (CCTV) వైపు చూస్తూ రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ క్షమాపణలు కోరింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

సూరత్‌లోని సలాబత్‌పురా ప్రాంతంలో జూన్ 12న ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక ఇంటి ప్రాంగణంలో నిలిపి ఉంచిన సైకిల్‌ను సదరు మహిళ దొంగిలించింది. సైకిల్ పోవడంతో యజమాని కూడా ఆశలు వదులుకున్నాడు. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ మరుసటి రోజు ఆ మహిళ అదే సైకిల్‌ను తీసుకుని మళ్లీ ఆ ఇంటికి వచ్చింది.

ఎంతో జాగ్రత్తగా ఆ సైకిల్‌ను ఇదివరకు ఎక్కడ ఉందో.. సరిగ్గా అదే స్థానంలో తిరిగి నిలిపింది. ఆ తర్వాత నేరుగా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరా వైపు తిరిగి, నమస్కరిస్తూ తన తప్పును క్షమించమని కోరుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

ఈ మొత్తం ఉదంతం అక్కడ ఉన్న నిఘా కెమెరాలో స్పష్టంగా రికార్డు అయింది. మొదట దొంగతనం చేయడం, ఆపై పశ్చాత్తాపంతో వస్తువును తిరిగి తెచ్చి క్షమాపణలు కోరడం వంటి దృశ్యాలతో కూడిన ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి వేదికలపై హల్‌చల్ చేస్తోంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమెను 'సంస్కారవంతమైన దొంగ' అని అభివర్ణిస్తూ కామెంట్లు పెడుతున్నారు. "తప్పు చేయడం సహజం.. కానీ దాన్ని తెలుసుకుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించిన ఆమె మనస్సాక్షిని అభినందించాలి" అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story