Viral News : దొంగతనం చేసి పారిపోయారు.. చీరలు మాత్రం తిరిగి పంపారు
తమిళనాడులో అత్యంత వింతైన , ఆసక్తికరమైన దొంగతనం ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ పట్టుచీరల షోరూమ్‌లో అత్యంత ప్లాన్ ప్రకారం..
Tamil Nadu Silk Saree Theft
Viral News : తమిళనాడులో అత్యంత వింతైన, ఆసక్తికరమైన దొంగతనం ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ పట్టుచీరల షోరూమ్‌లో అత్యంత ప్లాన్ ప్రకారం లక్షల విలువైన ఖరీదైన చీరలను కొట్టేసిన దొంగలు, ఆ తర్వాత మీడియాలో వచ్చిన వార్తలకు, పోలీసుల నిఘాకు భయపడి సైలెంట్‌గా యు-టర్న్ తీసుకున్నారు. అపహరించిన చీరలన్నింటినీ భద్రంగా కొరియర్ పార్శిల్‌లో పెట్టి మళ్లీ ఆ షాపు యజమాని చిరునామాకే తిప్పి పంపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అనూహ్య ఘటన తిరువణ్ణామలై జిల్లాలోని ఆరణి సమీపంలో ఉన్న సెవూరు గ్రామంలో చోటుచేసుకుంది.
లగ్జరీ కారులో వచ్చి స్కెచ్ వేశారు
సెవూరు గ్రామంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ వీధిలో కుమార్ అనే వ్యాపారి పట్టుచీరల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఒక లగ్జరీ కారులో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులతో కూడిన ఆరుగురి ముఠా కస్టమర్ల అవతారంలో ఆయన షాపునకు వచ్చింది. షాపులో ఉన్న అత్యంత ఖరీదైన పట్టుచీరలన్నింటినీ ఎంతో ఆసక్గా పరిశీలించిన ఆ ముఠా, చివరకు కేవలం కొన్ని తక్కువ ధర కలిగిన చీరలను మాత్రమే కొనుగోలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
సీసీటీవీలో బయటపడ్డ ఘరానా దొంగతనం
ఆ ముఠా వెళ్లిన రెండు రోజుల తర్వాత దుకాణంలోని సరుకును పరిశీలించిన యజమాని కుమార్‌కు కొన్ని ఖరీదైన పట్టుచీరలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే ఆయన షాపులోని సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. లగ్జరీ కారులో కస్టమర్లలా వచ్చి హడావుడి చేసిన ఆ ఆరుగురి ముఠాయే సేల్స్‌మెన్ దృష్టి మరల్చి తెలివిగా ఖరీదైన చీరలను దొంగిలించినట్లు స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడింది. దీనిపై ఆయన వెంటనే ఆరణి తాలుకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
టీవీల్లో వార్తలు.. కొరియర్‌లో పట్టుచీరల రీ-ఎంట్రీ
లగ్జరీ కారులో వచ్చి పట్టుచీరలు దొంగిలించిన ఈ వింత చోరీ ఘటన స్థానిక పత్రికలు, ప్రముఖ టీవీ ఛానళ్లలో విపరీతంగా ప్రసారమైంది. పోలీసుల దర్యాప్తు వేగవంతం కావడం, తమ ఫోటోలు, కారు నంబరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సదరు దొంగల ముఠాలో వణుకు మొదలైంది. ఇక దొరికిపోవడం ఖాయమని భయపడిన ఆ ముఠా, చోరీ చేసిన 32 ఖరీదైన పట్టుచీరలను ఒక బాక్స్‌లో పార్శిల్ చేసి కొరియర్ ద్వారా నేరుగా షాపు యజమాని కుమార్ చిరునామాకే పంపించేశారు.
షాపునకు వచ్చిన పార్శిల్‌ను తెరిచి చూసిన యజమాని కుమార్, దొంగిలించబడిన పట్టుచీరలన్నీ సురక్షితంగా తిరిగి రావడంతో ఆశ్చర్యపోయి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు చీరలను తిప్పి పంపినప్పటికీ, పోలీసులు మాత్రం కేసును వదలకుండా ఆ కొరియర్ పార్శిల్ ఏ ప్రాంతం నుంచి బుక్ అయింది అనే సాంకేతిక వివరాలను సేకరిస్తూ నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు.




