Tech Mahindra: వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా పర్మిషనా..? టెక్ మహీంద్రపై మహిళా ఉద్యోగి సంచలనం

Tech Mahindra: సిక్ లీవ్స్ అడిగినందుకు ఎలాంటి ముందస్తు నోటీస్ లేకుండా ఉద్యోగం నుండి తొలగించారని టెక్ మహీంద్ర మహిళా ఇంజినీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Naresh.k
Published on: 24 July 2026 12:57 PM IST
Tech Mahindra
X

Tech Mahindra: వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా పర్మిషనా..? టెక్ మహీంద్రపై మహిళా ఉద్యోగి సంచలనం

IT Work Culture: ఐటీ రంగం అంటేనే ఆకర్షణీయమైన జీతాలు, కార్పొరేట్ మెరుపులు. కానీ ఆ మెరుపుల వెనుక ఎంతటి తీవ్రమైన ఒత్తిడి, మానసిక వేదన దాగి ఉందో చాటిచెప్పే సంచలన ఘటన ఒకటి హైదరాబాద్‌లో వెలుగు చూసింది. అనారోగ్యంతో సెలవు తీసుకున్నందుకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించారంటూ ఒక మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోలీసులను ఆశ్రయించడం ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

హైదరాబాద్‌కు చెందిన భావన అనే మహిళా ఉద్యోగి టెక్ మహీంద్ర సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఆమె దుండిగల్ పోలీసులను ఆశ్రయించి కంపెనీ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. భావన తెలిపిన వివరాల ప్రకారం.. ఆరోగ్య సమస్యల కారణంగా ముందస్తు సమాచారం ఇచ్చి, సరైన మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించినప్పటికీ కంపెనీ ఏమాత్రం మానవత్వంతో వ్యవహరించలేదు. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనూ వరుస ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్ చేస్తూ విధుల్లో చేరాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు.

ఆ తర్వాత ఆమె చిన్నారి అనారోగ్యానికి గురై మళ్లీ లీవ్ అడగ్గా... ఇంకెన్ని రోజులు సెలవులు పెడతారు? అంటూ ప్రశ్నించారు. చివరకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, వివరణ కూడా కోరకుండా అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని భావన ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలో ఉద్యోగులపై అమలవుతున్న కఠిన నిబంధనలపై భావన సంచలన ఆరోపణలు చేశారు. ఆఫీసులో వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. ఇది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీయడమే. నా కెరీర్‌లో ఇంతటి దారుణమైన వర్క్ కల్చర్‌ను ఎప్పుడూ చూడలేదు అని ఆమె పేర్కొన్నారు.

ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు కెరీర్‌తో పాటు కుటుంబం, పిల్లల బాధ్యతలు ఉంటాయని, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్ దిగ్గజాలు మరింత సున్నితంగా, మానవత్వంతో వ్యవహరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం భావన టెక్ మహీంద్ర సంస్థ ఎదుట ధర్నాకు దిగారు. తనకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

అయితే, ఈ ఆరోపణలపై టెక్ మహీంద్ర యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనతో ఐటీ రంగంలో ఉద్యోగుల హక్కులు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ , అణచివేత ధోరణులు వంటి అంశాలపై సోషల్ మీడియాలోనూ, ఐటీ వర్గాల్లోనూ తీవ్రస్థాయిలో చర్చ మొదలైంది. కార్పొరేట్ సంస్కృతిలో మానవీయ విలువలు మరుగవుతున్నాయా అనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story