Viral News: ఇంటి గోడలే బిల్‌బోర్డులు.. ప్రకటనలతో రూ.19 లక్షలు సంపాదించిన టీనేజర్!

Viral News: ఫ్లోరిడాకు చెందిన టీనేజర్ షేలా వోల్ఫ్ తన ఇంటి గోడలపై బ్రాండ్ల లోగోలు, ప్రకటనలు పెట్టి రూ.19 లక్షలకు పైగా సంపాదించింది.

Arun Chilukuri
Published on: 23 Nov 2026 1:22 PM IST
Viral News
X

Viral News: ఇంటి గోడలే బిల్‌బోర్డులు.. ప్రకటనలతో రూ.19 లక్షలు సంపాదించిన టీనేజర్!

Viral News: కాలేజీ ఫీజు కోసం డబ్బు సంపాదించడానికి చాలామంది పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తారు లేదా స్కాలర్‌షిప్‌ల కోసం ప్రయత్నిస్తారు. కానీ, అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ టీనేజీ అమ్మాయి మాత్రం తన ఇంటి గోడలనే ఆదాయ వనరుగా మార్చుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హైస్కూల్ సీనియర్ అయిన షేలా వోల్ఫ్ (Shayla Wolfe) ఇప్పటివరకు తన ఇంటి గోడలపై బ్రాండ్ల ప్రకటనలు పెట్టి రూ. 19 లక్షలకు పైగా సంపాదించింది.

టైమ్స్ స్క్వేర్‌తో వచ్చిన వినూత్న ఆలోచన

షేలా ఇంట్లో ఉంటున్న ఎక్స్‌ఛేంజ్ స్టూడెంట్‌కు న్యూయార్క్‌లోని 'టైమ్స్ స్క్వేర్' గురించి వివరిస్తున్నప్పుడు ఆమెకు ఈ వినూత్న ఆలోచన తట్టింది. అక్కడ భారీ బిల్‌బోర్డులపై బ్రాండ్లు కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇస్తుండటాన్ని గుర్తుచేసుకున్న షేలా.. తన ఇంటి గోడలు కూడా అలా ఎందుకు మారకూడదని ఆలోచించింది. వెంటనే లివింగ్ రూమ్ గోడను టేప్‌తో చిన్నచిన్న భాగాలుగా విభజించి, ఒక్కో భాగానికి ధర రాసి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. "నా గోడపై మీ బ్రాండ్ లోగో పెట్టుకోవచ్చు. దానికి బదులుగా డబ్బు చెల్లిస్తే, మీ బ్రాండ్ గురించి సోషల్ మీడియాలో వీడియో చేసి చెబుతాను" అని అందులో పేర్కొంది.


ఒక్క రాత్రిలో వైరల్.. రూ.1.7 లక్షల వరకు చేరిన ధర

మొదట్లో ఈ వీడియోకు స్పందన రాకపోవడంతో షేలా డిలీట్ చేయాలనుకుంది. కానీ, ఆమె తమ్ముడు ఒక రాత్రి ఉంచి చూడమని చెప్పాడు. మరుసటి రోజు ఉదయానికి ఆ వీడియో వైరల్‌గా మారింది. ముందుగా చిన్న వ్యాపార సంస్థలు తమ లోగోలను గోడపై పెట్టించుకున్నాయి. ప్రారంభంలో ఒక్కో యాడ్‌కు రూ. 2,200 నుంచి రూ. 44,000 వరకు తీసుకునేది. క్రమంగా డిమాండ్ పెరగడంతో ఇప్పుడు ఇంట్లో ఐదు గోడలు ప్రకటనలతో నిండిపోయాయి. పెద్ద బ్రాండ్లు కూడా క్యూ కట్టడంతో, ఒక్కో ప్రత్యేక స్పాట్‌కు నెలకు రూ. 4,400 నుంచి రూ. 1.7 లక్షల వరకు ధర పలుకుతోంది. సాధారణంగా ఒక ప్రకటనను నెల రోజుల పాటు ఉంచుతారు.

మొదట వ్యతిరేకించిన తల్లి.. ఇప్పుడు ఫుల్ సపోర్ట్

షేలా ఆలోచనకు మొదట్లో తల్లి ఒప్పుకోలేదు. ఇంటిని ప్రకటనల బోర్డులా మార్చడమేంటని అభ్యంతరం తెలిపింది. అయితే, కూతురు సంపాదన చూశాక ఆమె మనసు మారింది. ఇప్పుడు తల్లే స్వయంగా కొత్త ప్రకటనలు పెట్టడానికి ఇంట్లో ఖాళీ స్థలాలు వెతికి పెడుతోంది.

కంటెంట్ క్రియేషన్ వైపు అడుగులు

తల్లిదండ్రులపై భారం వేయకుండా తన కాలేజీ ఫీజు తనే సంపాదించుకోవాలని షేలా ఈ ప్రయత్నం చేసింది. ఇప్పుడు కంటెంట్ క్రియేషన్‌నే కెరీర్‌గా మార్చుకోవాలని, 'యాడ్ వాల్ గర్ల్'గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఖాళీగా ఉన్న గోడను సైతం ఆదాయ వనరుగా మార్చి, కొత్తగా ఆలోచిస్తే అవకాశాలు మన చుట్టూనే ఉంటాయని షేలా నిరూపించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.