Terrifying Video: గేమ్ ఆడుతుండగా బాంబులా పేలిన ఫోన్..ప్రాణభయంతో పరుగులు తీసిన చిన్నారి

Terrifying Video: ఓ చిన్నారి ఫోన్‌లో గేమ్ ఆడుతుండగా మొబైల్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

CR Reddy
Published on: 12 March 2026 10:08 AM IST
Mobile Blast
X

Terrifying Video

Terrifying Video: నేటి కాలంలో చిన్న పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటం చాలా కామన్ అయిపోయింది. అయితే ఆ ఫోన్లే ఒక్కోసారి ప్రాణాంతకమైన ఆయుధాలుగా మారుతాయని హెచ్చరించేలా ఒక భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఇప్పుడు అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. ఒక చిన్నారి ఫోన్‌లో గేమ్ ఆడుకుంటుండగా, అకస్మాత్తుగా ఆ మొబైల్ బాంబులా పేలి మంటలు చెలరేగాయి. తృటిలో ఆ పాప ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోను గమనిస్తే.. ఒక చిన్నారి సోఫాలో ప్రశాంతంగా కూర్చుని ఫోన్‌లో గేమ్ ఆడుతూ పూర్తిగా నిమగ్నమైపోయింది. చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా గమనించనంతగా ఆ చిన్నారి ఫోన్ లోకంలో మునిగిపోయింది. అంతా సజావుగా సాగుతోందనుకుంటున్న సమయంలో, కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఆ ఫోన్ నుంచి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. క్షణాల్లోనే ఫోన్ నుంచి మంటలు, దట్టమైన పొగలు వచ్చాయి. ఆ అకస్మాత్తు పరిణామంతో హడలిపోయిన ఆ చిన్నారి, వెంటనే ఫోన్‌ను దూరంగా విసిరేసి అక్కడి నుంచి పరుగులు తీసింది. ఆ చిన్నారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ షాకింగ్ వీడియోను ఎక్స్ వేదికగా @fang_danie121 అనే యూజర్ షేర్ చేశారు. చైనాకు చెందిన హువావే కంపెనీ ఫోన్‌లో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. కేవలం 10 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటివరకు సుమారు 2.5 లక్షల మందికి పైగా వీక్షించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ఇది ఏఐ ద్వారా సృష్టించిన వీడియో అని అనుమానిస్తుండగా, గదిలోని వస్తువులు మరియు ఫర్నీచర్‌ను బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా నిజమైన ఘటన అని మరికొందరు వాదిస్తున్నారు.

పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా చార్జింగ్ పెట్టి ఫోన్ వాడటం, బ్యాటరీ ఉబ్బిన ఫోన్లను ఉపయోగించడం ఇలాంటి పేలుళ్లకు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్ విపరీతంగా వేడెక్కుతుంది, దీనివల్ల బ్యాటరీపై ఒత్తిడి పెరిగి పేలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, వారిని ఫోన్లకు దూరంగా ఉంచడం శ్రేయస్కరమని ఈ ఘటన హెచ్చరిస్తోంది.

CR Reddy

CR Reddy

Next Story