Snakes: పాములు నిజంగానే పగబడతాయా.? దీని వెనుక సైన్స్ ఏం చెబుతోంది
Snakes: పాములు పగబడతాయా ఒక వ్యక్తిని పదే పదే కాటు వేయడం వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటి? పాము జ్ఞాపకశక్తి, దాని విషంలోని ఔషధ గుణాల గురించి శాస్త్రవేత్తలు చెబుతున్న నిజాలు ఏంటి.
Snakes: పాములు నిజంగానే పగబడతాయా.? దీని వెనుక సైన్స్ ఏం చెబుతోంది
Snakes: చిన్నప్పటి నుంచి మనం పెద్దల మాటల్లోనో, లేదా సినిమాల్లోనో ఒక విషయాన్ని బాగా వింటూ ఉంటాం. "పామును కొడితే అది కళ్లల్లో మన రూపాన్ని దాచుకుంటుంది.. ఆ తర్వాత పగబట్టి మరీ కాటు వేస్తుంది" అని చాలామంది నమ్ముతుంటారు. ఈ అంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని తెలుగులో చాలానే సినిమాలు వచ్చాయి. కానీ, సైన్స్ ఏం చెబుతోంది.? నిజంగానే పాములకు అంత జ్ఞాపకశక్తి ఉంటుందా? దీనిపై జువాలజీ ప్రొఫెసర్ ఒకరు పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, పాములకు జ్ఞాపకశక్తి చాలా తక్కువగా ఉంటుంది. అవి ఒక మనిషిని గానీ, లేదా తమపై దాడి చేసిన ఏ ఇతర జీవిని గానీ గుర్తుపెట్టుకుని, ఆ తర్వాత వెతికి మరీ దాడి చేయడం అనేది అస్సలు జరగదు. మిగిలిన వన్యప్రాణులలాగే పాములు కూడా కేవలం రెండు కారణాల వల్లే ఇతర జీవులపై దాడి చేస్తాయి. ఒకటి తమ ఆహారం కోసం, రెండు తమకు ఏదైనా ప్రాణాపాయం ఉందని భావించినప్పుడు ఆత్మరక్షణ కోసం మాత్రమే చేస్తాయి.
సాధారణంగా పాములు వేటాడేటప్పుడు తమ నాలుక ద్వారా పరిసరాల్లోని వాసనను మాత్రమే గుర్తుపెట్టుకుంటాయి తప్ప, దాడి చేయాల్సిన జీవి రూపాన్ని లేదా ముఖాన్ని అస్సలు గుర్తుంచుకోలేవు. నిజానికి, చాలా వరకు పాములు తాము ఉండే పుట్ట లేదా గూడు నుంచి బయటకు వచ్చాక, తిరిగి తమ పుట్ట ఎక్కడ ఉందో కూడా మర్చిపోతాయని జంతు నిపుణులు చెబుతున్నారు. అంతటి బలహీనమైన మెదడు ఉన్న పాము.. మనుషులను గుర్తుపెట్టుకుని పగ తీర్చుకుంటుందని అనుకోవడం కేవలం ఒక మూఢనమ్మకం మాత్రమే. ఒకే వ్యక్తికి పదే పదే పాము కాటు వేయడం అనేది కేవలం ఒక యాదృచ్ఛికమైన సంఘటన మాత్రమే కావచ్చు
పాము అంటే మనకు భయం కానీ, దాని విషం ఎన్నో ప్రాణాలను కాపాడే మందుల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. పాము కాటుకు విరుగుడుగా ఇచ్చే 'యాంటీ వెనమ్'ను పాము విషం నుంచే తయారు చేస్తారు. ఇది మాత్రమే కాకుండా, క్యాన్సర్, ఆర్థరైటిస్, గుండె జబ్బులు, హైపర్‌టెన్షన్, స్ట్రోక్స్ లాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల నివారణకు వాడే మందులలో కూడా పాము విషాన్ని ఉపయోగిస్తారని జువాలజీ ప్రొఫెసర్ వివరించారు.




