The Silent National Anthem: శబ్దం లేదు కానీ దేశభక్తి మార్మోగింది! కాన్స్ అవార్డులు గెలుచుకున్న 'ది సైలెంట్ నేషనల్ ఆంథమ్'
The Silent National Anthem: వినికిడి, మాటల లోపం ఉన్న 500 మంది చిన్నారులు సంకేత భాషలో ఆవిష్కరించిన 'సైలెంట్ నేషనల్ ఆంథమ్'.
The Silent National Anthem: శబ్దం లేదు కానీ దేశభక్తి మార్మోగింది! కాన్స్ అవార్డులు గెలుచుకున్న 'ది సైలెంట్ నేషనల్ ఆంథమ్'
The Silent National Anthem: "దేశభక్తికి భాష అవసరం లేదు.. గుండెల్లో దేశం పట్ల ప్రేమ ఉంటే చాలు" అని నిరూపించారు ఆ చిన్నారులు. మాటలు రాని, వినికిడి లోపం ఉన్న దాదాపు 500 మంది ప్రత్యేక అవసరాలున్న చిన్నారులు తమ సైగలతో (సంకేత భాషలో) ఆవిష్కరించిన 'జనగణమన' ప్రదర్శన దేశభక్తికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చింది. శబ్దం, సంగీతం లేకపోయినా ప్రతి ఒక్కరి హృదయాల్లో దేశభక్తి భావనలు మార్మోగేలా చేసింది.
2011లో ముద్రా గ్రూప్.. 'బిగ్ సినిమాస్' కోసం రూపొందించిన ‘ది సైలెంట్ నేషనల్ ఆంథమ్’ (The Silent National Anthem) ప్రచారం వెనుక ఈ అద్భుతమైన ప్రయోగం దాగి ఉంది. "దేశభక్తికి శబ్దం, భాష అవసరం లేదు" అనే ఉద్దేశంతో ప్రముఖ ప్రకటనకర్త బాబీ పవార్ ఆలోచన నుంచి ఈ కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది. సాధారణంగా థియేటర్లలో జాతీయ గీతాన్ని వింటాం.. కానీ మొదటిసారిగా దాన్ని హృదయంతో చూసి, అనుభూతి చెందేలా ఈ ప్రయోగాన్ని డిజైన్ చేశారు.
ముంబయిలోని ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు చెందిన 8 పాఠశాలలకు చెందిన దాదాపు 500 మంది చిన్నారులు సంకేత భాషలో ఈ జాతీయ గీతాన్ని ప్రదర్శించారు. పెద్ద మాటలు, భారీ హంగులు లేకపోయినా చిన్నారుల చేతి కదలికలు, వారి కళ్లలో కనిపించిన గర్వం థియేటర్లలో ఉన్న ప్రేక్షకుల కళ్లను తడిపేసాయి. "మాటలు రాకపోయినా మేము భారతీయులమే" అని వారి ప్రతి సైగా చాటిచెప్పింది.
దేశభక్తిని వినిపించడం కంటే హృదయంతో అనుభూతి చెందేలా చేసిన ఈ 'సైలెంట్ ఆంథమ్' ప్రచారానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ప్రకటనల రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కాన్స్ లయన్స్ (Cannes Lions) ఫెస్టివల్‌లో ఒక సిల్వర్, రెండు బ్రాంజ్ అవార్డులను ఈ వీడియో సొంతం చేసుకుంది.
భారతమాతపై ప్రేమను చాటడానికి స్వరం, మాటలు అక్కర్లేదని, అనుభూతి చెందే భావమే అసలైన దేశభక్తి అని ఈ చిన్నారుల ముచ్చటైన సంకేత గీతం ప్రపంచానికి చాటిచెప్పింది.




