Helmet: అందుకే హెల్మెట్ పెట్టుకోమనేది...ఈ వీడియో ఒక్కసారి చూడండి
Helmet: బెంగళూరులో జరిగిన ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Helmet: అందుకే హెల్మెట్ పెట్టుకోమనేది...ఈ వీడియో ఒక్కసారి చూడండి
Bengaluru Road Accident: అపాయం ఎటు నుండి వస్తుందో ఎవరూ ఊహించలేరు అనే మాటను మనం తరచూ వింటూనే ఉంటాం. రోడ్డుపై వెళ్లేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలని పోలీసులు, పెద్దలు ఎంత మొత్తుకుంటున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉంటారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఒక వింత, భయంకరమైన రోడ్డు ప్రమాద వీడియో చూస్తే.. అమ్మో ప్రమాదం ఇలా కూడా వస్తుందా? అని ముక్కున వేలేసుకోక తప్పదు.
బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి బైక్‌పై రోడ్డుపై తన దారిలో తాను ఎంతో జాగ్రత్తగా వెళ్తున్నాడు. ఎటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు లేవు, మితిమీరిన వేగం లేదు. కానీ, సరిగ్గా అదే సమయంలో రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి, నేరుగా వచ్చి అతడి తలపై పడింది.
ఆ దెబ్బకు అతడు బైక్‌తో సహా రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో క్షణాల్లో ఏం జరిగిందో కూడా అతడికి అర్థం కాలేదు. ఇది గమనించిన తోటి వాహనదారులు, స్థానికులు వెంటనే స్పందించి, అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మొత్తం దృశ్యం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డవగా.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా సదరు వాహనదారుడు హెల్మెట్ ధరించకపోవడం వల్లే అంత పెద్ద దెబ్బ తగిలిందని కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ అతడు హెల్మెట్ పెట్టుకుని ఉంటే.. ఆ చెట్టు కొమ్మ నేరుగా తలకు తగలకుండా హెల్మెట్‌కు తగిలి ఉండేది. ప్రమాదం తీవ్రత తగ్గి, కచ్చితంగా సురక్షితంగా బయటపడేవాడు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
రోడ్డుపై వెళ్లేటప్పుడు మన తప్పు లేకపోయినా.. పక్కవారి వల్లో, లేదా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్లో ప్రమాదాలు జరగొచ్చు. అందుకే పోలీసులు పదే పదే నెత్తీ నోరూ బాదుకుంటూ "హెల్మెట్ తప్పనిసరి" అని చెబుతుంటారు. హెల్మెట్ అనేది కేవలం చలానాల నుంచి తప్పించుకోవడానికి కాదు.. మన ప్రాణాలను కాపాడుకోవడానికి అనే విషయాన్ని ఈ వీడియో మరోసారి నిరూపించింది.
ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసేవాళ్లు, హెల్మెట్ బోర్డర్ దాటిన తర్వాత పెట్టుకుందాంలే అనుకునేవాళ్లు తప్పకుండా ఈ వీడియో చూడాలి. ఇప్పటికైనా బైక్ స్టార్ట్ చేసే ముందు స్టాండ్ తీయడంతో పాటు హెల్మెట్ పెట్టుకోవడం కూడా ఒక అలవాటుగా మార్చుకుందాం.




