Uber Driver Inspiring Story: 'నువ్వు పనికిరావు' అన్నారు.. ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా మారిన డ్రైవర్.!

Uber Driver Inspiring Story: సాధారణంగా నెలకి 80 వేల రూపాయల పాసివ్ ఇన్‌కమ్ (అద్దె రూపంలో) వస్తుంటే ఎవరైనా హాయిగా ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని

G Krishna
Published on: 19 July 2026 5:32 PM IST
Uber Driver Inspiring Story
X

Uber Driver Inspiring Story

Uber Driver Inspiring Story: సాధారణంగా నెలకి 80 వేల రూపాయల పాసివ్ ఇన్‌కమ్ (అద్దె రూపంలో) వస్తుంటే ఎవరైనా హాయిగా ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. కానీ, ఢిల్లీకి చెందిన ఒక ఉబెర్ డ్రైవర్ మాత్రం అలా అనుకోలేదు. ఆయనకు డబ్బు సంపాదించడం కంటే కూడా.. తనను చేతకానివాడిగా చూసిన సమాజానికి తానేంటో నిరూపించడమే లక్ష్యంగా మారింది. ఒకప్పుడు గుండెపోటు వచ్చిందని తనను వదిలించుకున్న వారికి, ఆ అనారోగ్యం తన విలువను తగ్గించలేదని నిరూపిస్తూ ఆయన సాగిస్తున్న ప్రయాణం ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆస్తా సేథ్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తన ప్రయాణంలో భాగంగా ఈ డ్రైవర్‌తో మాట్లాడారు. ఆ ఐదు నిమిషాల సంభాషణలో ఆమెకు తెలిసిన విషయాలు, సదరు డ్రైవర్ చూపిస్తున్న పట్టుదల తనను ఆలోచింపజేశాయంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ ఆసక్తికర కథనాన్ని పంచుకున్నారు.

గుండెపోటు వస్తే.. 'నువ్వు దేనికీ పనికిరావు' అంటూ..

బీహార్‌లోని సమస్తీపూర్ ప్రాంతానికి చెందిన ఈ డ్రైవర్, గతంలో ఢిల్లీలో తన బంధువులకు చెందిన ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదించేవారు. అయితే, గతేడాది ఆయన జీవితం ఒక ఊహించని మలుపు తిరిగింది. ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు (Heart Attack) వచ్చింది. ఆ కష్టసమయంలో తోడుగా నిలవాల్సిన బంధువులు, ఫ్యాక్టరీ యాజమాన్యం.. ఆయన కోలుకుంటున్న సమయంలో అండగా ఉండాల్సింది పోయి, "నువ్వు ఇకపై బరువైన పనులు చేయలేవు, నువ్వు దేనికీ పనికిరావు" అంటూ ఫ్యాక్టరీ నుంచి తీసేశారు. ఆ అవమానం ఆయనను కుంగదీయలేదు, పైగా తన కాళ్ల మీద తాను కొత్తగా నిలబడాలనే కసిని పెంచింది.

కోట్ల ఆస్తులున్నా.. రోజుకు 12 గంటల శ్రమ

ఆస్తా సేథ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు డ్రైవర్‌కు నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో దాదాపు రూ. 80 లక్షల విలువచేసే రెండు ఫ్లాట్లు ఉన్నాయి. ఆ రెండు ఇళ్ల ద్వారా ఆయనకు ప్రతి నెలా రూ. 80,000 అద్దె ఆదాయం వస్తుంది. ఇది కాకుండా బీహార్‌లో సొంతంగా తాతల నాటి ఆస్తులు కూడా ఉన్నాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నా ఆయన మాత్రం ఉబెర్ డ్రైవర్‌గా మారారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కష్టపడుతూ, నెలకు అదనంగా మరో రూ. 50,000 సంపాదిస్తున్నారు. తనకున్న రెండు ఫ్లాట్లను తన ఇద్దరు కుమార్తెల కోసం దాచిపెట్టానని ఆయన గర్వంగా చెబుతున్నారు.

అవమానించిన వారికి గుణపాఠం..

"ఆయన అనుకుంటే హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ తనకు గుండెపోటు వచ్చినంత మాత్రాన తనేమీ పనికిరానివాడిని అయిపోలేదని, తన విలువ తగ్గిపోలేదని ఆనాడు తక్కువ చేసి మాట్లాడిన వారికి నిరూపించడానికే ఆయన ఈ పనిని ఎంచుకున్నారు" అని ఆస్తా సేథ్ తన పోస్టులో రాసుకొచ్చారు. చిన్న చిన్న కారణాలు వెతుక్కుంటూ జీవితంలో ఓడిపోయాం అనుకునే మనందరికీ ఆయనొక గొప్ప స్ఫూర్తి అని కొనియాడారు.

ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు సదరు డ్రైవర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "కీప్ ఇట్ అప్ అంకుల్" అని కొందరు, "మీరే నిజమైన హీరో" అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. లగ్జరీగా బ్రతికే అవకాశం ఉన్నా, కేవలం ఆత్మగౌరవం కోసం, జీవితంలో ఒక లక్ష్యం కోసం కష్టపడుతున్న ఈ డ్రైవర్ కథ నిజంగానే స్ఫూర్తిదాయకం.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story