వైద్య చరిత్రలోనే గొప్ప అద్భుతం.. చెల్లెలి మాతృత్వ కల కోసం అక్క ఏం చేసిందో తెలుసా..?
UK Woman: MRKH సిండ్రోమ్ కారణంగా గర్భాశయం లేకుండా జన్మించిన లారెన్ ఫౌలర్, అక్క ఇచ్చిన గర్భాశయ దానంతో నేడు 26 వారాల గర్భిణిగా మారింది.
వైద్య చరిత్రలోనే గొప్ప అద్భుతం.. చెల్లెలి మాతృత్వ కల కోసం అక్క ఏం చేసిందో తెలుసా..?
Viral: పుట్టుకతోనే గర్భాశయం లేదనే నిజాన్ని జీర్ణించుకోవడం ఎంత కష్టమో. మాతృత్వపు మధురామృతాన్ని ఆస్వాదించలేనని తెలిసినప్పుడు ఒక మహిళ పడే వేదన వర్ణనాతీతం. సరిగ్గా ఇదే బాధను అనుభవించిన యూకేకు చెందిన 36 ఏళ్ల లారెన్ ఫౌలర్ జీవితంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. జన్యుపరమైన MRKH సిండ్రోమ్ కారణంగా గర్భాశయం లేకపోయినా, ఆమె అక్క ఇచ్చిన అపూర్వ బహుమతితో నేడు పండంటి భవిష్యత్తుకు స్వాగతం పలుకుతోంది.
లారెన్ అండాశయాలు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, సహజంగా గర్భం దాల్చే అవకాశం లేకపోయింది. ఈ విషయాన్ని గ్రహించిన ఆమె 40 ఏళ్ల అక్క కెల్లీ ముందుకు వచ్చి తన గర్భాశయాన్నే చెల్లెలికి దానం చేసింది. వైద్యులు సుమారు 9 గంటలకు పైగా శ్రమించి ఈ సంక్లిష్టమైన గర్భాశయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతం చేశారు.
సర్జరీ తర్వాత వైద్యులు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతి ద్వారా పిండాన్ని గర్భంలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం లారెన్ 26 వారాల గర్భంతో ఆరోగ్యంగా ఉన్నారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమెకు, రాబోయే అక్టోబరు నెలలో ప్లాన్డ్ సిజేరియన్ ద్వారా ప్రసవం చేయాలని డాక్టర్లు భావిస్తున్నారు.
లారెన్ ఫౌలర్ మాట్లాడుతూ...గత 20 ఏళ్లుగా మాతృత్వం కోసం నిరీక్షిస్తున్నా. ఈ పోరాటాన్ని వదిలేయడానికి నేను సిద్ధంగా లేను. రికవరీ అనేది శారీరకంగా, మానసికంగా ఎంతో సవాలుతో కూడుకున్నది. అయినా సరే, ప్రతి రోజూ కొత్త ధైర్యాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగుతున్నా అని చెప్పుకొచ్చారు.
వైద్య చరిత్రలో మైలురాయిగా నిలిచిన ఈ ఘటన, తీవ్రమైన గర్భాశయ లోపాలతో బాధపడుతున్న ఎందరో మహిళలకు మాతృత్వపు కల సాకారమవుతుందనే నూతన ఆశను ఇస్తోంది.




