Jantar Mantar: జంతర్ మంతర్ నిరసనల్లో పరిచయం.. లాఠీచార్జ్‌తో మొదలైన లవ్‌స్టోరీ పెళ్లిపీటల దాకా..!
Jantar Mantar: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ నిరసనల్లో అరుదైన సంఘటన.
Jantar Mantar: జంతర్ మంతర్ నిరసనల్లో పరిచయం.. లాఠీచార్జ్‌తో మొదలైన లవ్‌స్టోరీ పెళ్లిపీటల దాకా..!
Jantar Mantar: ఢిల్లీలోని జంతర్ మంతర్.. నిత్యం ప్రజా సమస్యలు, ధర్నాలు, నిరసనలు, పోలీసుల సైరన్లతో హోరెత్తే ప్రాంతం. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా విదేశాలు, విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఆందోళనలతో అట్టుడికిపోయిన ఆ నిరసన క్షేత్రంలో.. ఊహించని విధంగా ఓ అరుదైన, ఆసక్తికరమైన ప్రేమ కథ చిగురించింది.
బీహార్‌కు చెందిన మోహన్ శ్రీవాస్తవ అనే యువకుడు నీట్ అక్రమాలపై పోరాడేందుకు ఢిల్లీ చేరుకున్నాడు. గత 15 రోజులుగా జంతర్ మంతర్ వద్దే ఉంటూ నిరసన కార్యక్రమాల్లో అత్యంత చురుగ్గా పాల్గొన్నాడు. అదే సమయంలో, నీట్ పరీక్ష రాసి న్యాయం కోసం పోరాడుతున్న ఢిల్లీకి చెందిన ఓ యువతి కూడా ఆ ఆందోళనల్లో భాగమైంది. ధర్నా సమయంలో మోహన్ చూపిస్తున్న చొరవ, ఆందోళనల్లో ఆయన చురుకుదనం ఆ యువతిని ఆకట్టుకున్నాయి. మోహన్ సుదూర ప్రాంతం నుంచి రావడం, అక్కడ సౌకర్యాలు లేకపోవడంతో.. స్థానికురాలైన ఆ యువతి ఆయనకు ఆహారం, ఇతర అవసరాలను దగ్గరుండి చూసుకుంది. అలా పోరాటాల బాటలో ఇద్దరి మధ్య పరిచయం, స్నేహం ఏర్పడ్డాయి.
ఒకరోజు జంతర్ మంతర్ వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పోలీసుల దెబ్బలకు మోహన్ శ్రీవాస్తవ తలకు తీవ్ర గాయమై రక్తసిక్తమయ్యాడు. స్పృహతప్పి కింద కుప్పకూలిపోయాడు. ఆ క్షణంలో ఏమాత్రం భయపడకుండా ఆ యువతి మోహన్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. అతడి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ధైర్యంగా నిలబడి, వైద్యులతో మాట్లాడి చికిత్స అందించింది. మోహన్ పూర్తిగా కోలుకునే వరకు ప్రతీ క్షణం ఆస్పత్రిలోనే ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంది.
తన ప్రాణాలను కాపాడి, అనుక్షణం పక్కనే ఉన్న ఆ యువతి ఆప్యాయతకు మోహన్ మురిసిపోయాడు. అతడు స్పృహలోకి వచ్చాక.. ఆ యువతి తన మనసులోని భావాలను దాచుకోలేకపోయింది. నిన్ను ఈ స్థితిలో చూసి నా గుండె ఆగిపోయినంత పని అయింది. నువ్వు లేకుండా నేను బతకలేను అంటూ ఆస్పత్రిలోనే తన ప్రేమను వ్యక్తపరిచింది. ఆమె నిస్వార్థమైన ప్రేమకు, చూపించిన చొరవకు ముగ్ధుడైన మోహన్ శ్రీవాస్తవ వెంటనే తన సమ్మతి తెలిపారు.
ప్రేమాయణాన్ని సాగదీస్తూ సమయాన్ని వృథా చేయడం ఎందుకనుకున్న ఆ జంట.. డిస్చార్జ్ అయిన వెంటనే ఓ ఆలయానికి వెళ్లారు. ఇరుపక్షాల ఆమోదంతో, సంప్రదాయబద్ధంగా గుడిలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. న్యాయం కోసం చేసిన ఒక సుదీర్ఘ పోరాటం.. ఇద్దరి జీవితాలను ఇలా ఓ అందమైన బంధంతో ముడివేస్తుందని ఎవరూ ఊహించలేదు. లాఠీచార్జ్, ఆసుపత్రి డ్రామాల నడుమ మొదలై పెళ్లి పీటల వరకు వెళ్లిన ఈ రియల్ లైఫ్ లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.




