Viral Video: పంట పొలంలో 'పల్కీ మే హోకే సవార్'.. నెటిజన్ల మనసులు దోచుకుంటున్న పల్లెటూరి పిల్లల డ్యాన్స్!

Viral Video: మన దేశంలో ఏరువాక పౌర్ణమి వచ్చిందంటే చాలు.. పొలం పనులు పండుగలా మారుతాయి.

Arun Chilukuri
Published on: 6 July 2026 12:25 PM IST
Viral Video
X

Viral Video: పంట పొలంలో 'పల్కీ మే హోకే సవార్'.. నెటిజన్ల మనసులు దోచుకుంటున్న పల్లెటూరి పిల్లల డ్యాన్స్!

Viral Video: మన దేశంలో ఏరువాక పౌర్ణమి వచ్చిందంటే చాలు.. పొలం పనులు పండుగలా మారుతాయి. తొలకరి చినుకులు పలకరించడంతో దేశవ్యాప్తంగా వరి నాట్లు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో పల్లెటూరి నిరాడంబర వాతావరణంలో, బురద పొలంలో పని చేస్తున్న ఇద్దరు బాలికల సాధారణ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా వైరల్ అవుతూ నెటిజన్ల హృదయాలను కొల్లగొడుతోంది.

ఈ వైరల్ వీడియోలో ఎలాంటి భారీ సెట్టింగులు లేవు, ఖరీదైన దుస్తులు లేవు, ఇదొక పెద్ద డ్యాన్స్ షో అంతకన్నా కాదు. చుట్టూ పచ్చని పంట పొలాలు, ప్రశాంతమైన గ్రామీణ వాతావరణం మాత్రమే కనిపిస్తోంది. ఒక బాలిక తన చేతిలోని వరి నారును బురదలో నాటుతున్న సమయంలో.. బ్యాక్‌గ్రౌండ్‌లో బాలీవుడ్ క్లాసిక్ సాంగ్ "పల్కీ మే హోకే సవార్ చలి రే.." (Palki Mein Hoke Sawar Chali Re) అనే పాట ప్రారంభం అవుతుంది. అంతే.. ఆ చిన్నారులు తాము చేస్తున్న పనిని కాసేపు పక్కన పెట్టి, ఆ పాటకు అనుగుణంగా ఎంతో లయబద్ధంగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు.

ముఖంలో అమాయకపు చిరునవ్వులు చిందిస్తూ, ఒంటికి, వేసుకున్న బట్టలకు మట్టి అంటుతున్నా అస్సలు లెక్కచేయకుండా ఆ ఇద్దరు బాలికలు చేసిన నృత్యం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ నిమిషం పాటు సాగే వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "ఈ వీడియో చూస్తుంటే రోజంతా ఉన్న ఒత్తిడి (Stress) ఒక్కసారిగా మాయమైపోతోంది" అని కొందరు కామెంట్ చేస్తుంటే.. "నిజమైన ఆనందం అనేది ఖరీదైన వస్తువుల్లోనో, విలాసవంతమైన జీవితంలోనో ఉండదు.. ఇలాంటి చిన్న చిన్న క్షణాల్లోనే దాగి ఉంటుంది" అని మరికొందరు నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు.

ఆకాశం అంతా మేఘావృతమై వర్షం పడేలా ఉండటం, చుట్టూ ప్రకృతి పచ్చదనం పరుచుకోవడం, అదే సమయంలో పక్కనే ఒక చిన్న బాలుడు గొడుగు పట్టుకుని పొలంలో వరినాట్లు వేస్తూ కనిపించడం ఈ వీడియోకు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నేటి యాంత్రిక జీవనంలో పల్లెటూరి నిరాడంబర జీవనాన్ని, స్వచ్ఛమైన, అమాయకమైన బాల్యాన్ని ఈ వీడియో కళ్లకు కట్టినట్లు చూపిస్తోందంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story