Viral News: ఆఫీసర్‌కు బాదం పప్పు గిఫ్ట్.. యువకుడి వింత నిరసన!
Viral News: ఛత్తీస్‌గఢ్‌లో ఓ అధికారి నిర్లక్ష్యానికి నిరసనగా యువకుడు బాదం పప్పు కానుకగా ఇచ్చిన వింత ఘటన. ఏడు నెలలుగా తిరుగుతున్నా ఫైలు దొరకలేదనడంతో జ్ఞాపకశక్తి పెరగాలంటూ నిరసన.
Viral News: ఆఫీసర్‌కు బాదం పప్పు గిఫ్ట్.. యువకుడి వింత నిరసన!
Viral News: ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల కదలిక ఎంత నెమ్మదిగా ఉంటుందో మనకు తెలిసిందే. అయితే, ఏడు నెలలుగా తన ఫైలును గాలికి వదిలేసిన ఓ అధికారిణికి ఒక యువకుడు ఇచ్చిన 'జ్ఞాపకశక్తి' ట్రీట్‌మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ హౌసింగ్ బోర్డు కార్యాలయం ఈ వింత నిరసనకు వేదికైంది.
తరుణ్ కుమార్ అనే యువకుడు హౌసింగ్ బోర్డు ద్వారా రీసేల్‌లో ఒక ఫ్లాటు కొనుగోలు చేశారు. దాన్ని తన పేరు మీదకు మార్చుకోవడానికి (మ్యుటేషన్) దరఖాస్తు చేసుకున్నారు. కానీ, కార్యాలయంలోని మహిళా అధికారిణి మాత్రం గత ఏడు నెలలుగా అతడిని ముప్పుతిప్పలు పెడుతున్నారు.
"దాదాపు 50 సార్లకు పైగా ఆఫీసు చుట్టూ తిరిగాను. వెళ్లిన ప్రతిసారీ ఫైలు కనిపించడం లేదని, వెతుకుతున్నామని చెబుతూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు" అని తరుణ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల మతిమరుపుపై విసిగిపోయిన తరుణ్, వారికి బుద్ధి చెప్పేందుకు ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు.
నేరుగా సదరు అధికారిణి క్యాబిన్‌లోకి వెళ్లిన తరుణ్.. తన వెంట తెచ్చిన అర కిలో బాదం పప్పును ఆమె టేబుల్‌పై కుమ్మరించారు. "మేడమ్.. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అప్పుడైనా నా ఫైలు ఎక్కడ పెట్టారో మీకు గుర్తొస్తుంది. అది దొరికాక నాకు ఫోన్ చేయండి" అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెనుదిరిగారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బాధితుడి ఆవేదనను చూసైనా అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి.




