ఇదేందయ్యా ఇది.! లంచ్ బ్రేక్ నిమిషం దాటితే గంట పని..
bizarre office rules: లంచ్ బ్రేక్ కేవలం ఒక్క నిమిషం దాటితే ఏకంగా గంట పాటు ఉచితంగా పనిచేయాలంటూ ఓ కంపెనీ పెట్టిన వింత రూల్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.
ఇదేందయ్యా ఇది.! లంచ్ బ్రేక్ నిమిషం దాటితే గంట పని..
bizarre office rules: ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు యాజమాన్యాలు రకరకాల నిబంధనలు పెట్టడం సహజం. క్రమశిక్షణ పేరిట కొన్నిసార్లు కఠినంగా వ్యవహరిస్తుంటారు. అయితే ఓ కంపెనీ బాస్ తన స్టాఫ్‌కి విధించిన ఓ వింత రూల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. లంచ్ బ్రేక్ విషయంలో ఆ కంపెనీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం చూసి నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
నెట్టింట వైరల్ అవుతున్న వివరాల ప్రకారం, ఆ ఆఫీసులో లంచ్ బ్రేక్ సమయం కేవలం అరగంట మాత్రమే. ఆ అరగంట సమయం దాటి ఒక్క నిమిషం లేటైనా సరే, ఆ ఒక్క నిమిషానికి గానూ సాయంత్రం 6 గంటల తర్వాత ఏకంగా 60 నిమిషాల పాటు అదనంగా ఓవర్‌టైమ్ పనిచేయాలని మేనేజ్‌మెంట్ నోటీస్ బోర్డులో రాసుకొచ్చింది.
అంటే 31 నిమిషాలు లంచ్ చేస్తే రాత్రి 7 గంటల వరకు ఆఫీసులోనే ఉండి తీరాలి. ఆ అదనపు సమయానికి ఎలాంటి వేతనం ఇవ్వబోమని, వీలైనంత త్వరగా భోజనం ముగించాలని యాజమాన్యం ఆ నోటీసులో స్పష్టం చేసింది.
కంపెనీ తీసుకున్న ఈ విచిత్రమైన నిర్ణయం ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది. నోటీస్ బోర్డు ఫోటోను చూసిన నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఏదైనా కారణంతో పొరపాటున పది నిమిషాలు లేట్ అయితే తెల్లవార్లూ ఆఫీసులోనే పనిచేయాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నెలనెలా ఉద్యోగుల జీతాలు ఇవ్వడంలో ఏవైనా ఆలస్యమైతే యాజమాన్యం ఇలాగే అదనపు వడ్డీ చెల్లిస్తుందా అని నెటిజన్లు లాజిక్‌గా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నియంతృత్వ పోకడలతో కార్మికులను బానిసల్లా చూస్తున్నారని, ఇది కచ్చితంగా టాక్సిక్ వర్క్ కల్చర్ అని విమర్శిస్తున్నారు.




