Viral Video : భారతీయులంటే ప్రేమే వేరబ్బా.. అమెరికన్ మహిళ కన్నీటి వీడ్కోలు..
"మనసారా ప్రేమిస్తే దానికి దేశాలు, సరిహద్దుల పరిమితులు ఉండవు" అని నిరూపించే ఒక ఆత్మీయమైన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
american woman emotional
"మనసారా ప్రేమిస్తే దానికి దేశాలు, సరిహద్దుల పరిమితులు ఉండవు" అని నిరూపించే ఒక ఆత్మీయమైన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. భారతీయుల ఆతిథ్యం, ప్రేమాభిమానాలు ఎంత గొప్పవో చాటిచెప్పేలా ఉన్న ఈ విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అమెరికా నుంచి తిరిగి తమ సొంత దేశమైన భారతదేశానికి బయలుదేరుతున్న ఒక భారతీయ దంపతులను చూసి, వారి అమెరికన్ పొరుగు మహిళ తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటూ హత్తుకున్న తీరు నెటిజన్ల హృదయాలను పిండేస్తోంది.
డెట్రాయిట్ ఎయిర్‌పోర్ట్ ప్రయాణంలో ఊహించని భావోద్వేగం
విజయ్ కొక్కెర గడ్డ అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుడు తన ఖాతాలో ఈ మనసును హత్తుకునే వీడియోను షేర్ చేశారు. అమెరికాలోని డెట్రాయిట్ విమానాశ్రయానికి (Detroit Airport) బయలుదేరుతున్న ఆఖరి క్షణాల్లో ఈ అపూర్వ సన్నివేశం ఆవిష్కృతమైంది. వారు తమ ఇల్లు ఖాళీ చేసి బయట నిలబడి ఉండగా, వారి పక్కింట్లో ఉండే అమెరికన్ మహిళ కళ్లమ్మట నీళ్లు కార్చుకుంటూ వారి వద్దకు వచ్చింది. ఆ దంపతులను గట్టిగా కౌగిలించుకుని, వారి భుజాలపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చేసింది. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నానని, వెళ్లవద్దన్నట్లుగా ఆమె పట్టు సడలించకుండా ఏడుస్తున్న దృశ్యం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆ జంట ఆమెను ఓదార్చడానికి ఎంత ప్రయత్నించినా, ఆమె భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది.
సీక్రెట్‌గా రికార్డ్ అయిన ఆత్మీయ అనుబంధం
ఈ వీడియో వెనుక మరో ఆసక్తికరమైన విషయాన్ని విజయ్ పంచుకున్నారు. తము ఈ నిష్క్రమణ క్షణాలను కెమెరాలో రికార్డ్ చేస్తున్నామని ఆ దంపతులకు అస్సలు తెలియదు. వారి స్నేహితుడు ఒకరు వీరికి తెలియకుండా దూరంగా నిలబడి ఈ అరుదైన వీడ్కోలు క్షణాలను వీడియో తీసి, తర్వాత వారికి కానుకగా పంపారు. రెండు వేర్వేరు సంస్కృతులు, దేశాలకు చెందిన కుటుంబాల మధ్య చిగురించిన స్వచ్ఛమైన ప్రేమాభిమానాలకు, జీవితాంతం దాచుకోదగ్గా జ్ఞాపకానికి ఈ వీడియో నిదర్శనంగా నిలిచింది.
'భారతీయుల ఆప్యాయతే వేరు'.. సోషల్ మీడియాలో వైరల్
ఈ హృదయపూర్వక వీడ్కోలు వీడియో సోషల్ మీడియాలోకి రాగానే నెటిజన్లు ఫిదా అయిపోయారు. ప్రవాస జీవితంలో తాము వదిలివచ్చిన పొరుగువారిని, స్నేహితులను గుర్తుచేసుకుంటూ ఎంతోమంది తమ అనుభవాలను కామెంట్లలో పంచుకున్నారు. "మన భారతీయుల ఆతిథ్యానికి, కలుపుగోరుతనానికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే" అని కొందరు కామెంట్ చేయగా, "అమాయకమైన, స్వచ్ఛమైన ప్రేమకు భాష, సరిహద్దులు లేవని ఈ వీడియో నిరూపించింది" అని మరికొందరు రాసుకొచ్చారు. మరికొందరైతే బ్రెజిల్, ఇతర దేశాల నుంచి తిరిగి వచ్చినప్పుడు తమకు కూడా ఇలాంటి భావోద్వేగ అనుభవాలే ఎదురయ్యాయని గుర్తుచేసుకున్నారు. మొత్తానికి, సముద్రాలు దాటినా మన భారతీయులు పంచే ఆప్యాయత, సంస్కారమే వారిని ప్రపంచంలో ఎక్కడైనా ప్రత్యేకంగా నిలబెడుతుందని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది!




