Viral Video: చేతిలో సంచి.. సింపుల్‌గా విమానం ఎక్కిన దంపతులు.. నెటిజన్లు ఫిదా!

Viral Video: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ గ్రామీణ దంపతుల నిరాడంబరత నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Arun Chilukuri
Published on: 18 Nov 2026 11:18 AM IST
Viral Video
X

Viral Video: చేతిలో సంచి.. సింపుల్‌గా విమానం ఎక్కిన దంపతులు.. నెటిజన్లు ఫిదా!

Viral Video: విమానం ఎక్కాలనేది ప్రతి సామాన్యుడి కల. తొలిసారి విమాన ప్రయాణం చేసేటప్పుడు చాలామందిలో కొంత భయం, బెరుకు కనిపిస్తాయి. మరికొందరు విమానాశ్రయానికి వస్తున్నామంటే ప్రత్యేకంగా హుందాగా, హంగు ఆర్భాటాలతో కనిపించాలని తాపత్రయపడుతుంటారు. కానీ, హైదరాబాద్‌లోని శంషాబాద్ (రాజీవ్ గాంధీ) అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించిన ఓ గ్రామీణ దంపతుల నిరాడంబరత ఇప్పుడు దేశవ్యాప్తంగా నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది.

విమానం ఎక్కేందుకు అనౌన్స్‌మెంట్ రాగానే.. ఆ దంపతులు ఎలాంటి కంగారు, హడావుడి లేకుండా అత్యంత సహజంగా ముందుకు కదిలారు. మనం సాధారణంగా ఊరికి వెళ్లేటప్పుడు ఆర్టీసీ ఎర్ర బస్సు ఎక్కినట్లుగానే, చేతిలో ఓ సాధారణ సంచిని పట్టుకుని ఎంతో ప్రశాంతంగా విమానం మెట్లెక్కారు. వారి ముఖాల్లోని స్వచ్ఛమైన చిరునవ్వు, ఎలాంటి భేషజాలు లేని ఆ తీరు అక్కడున్న వారితో పాటు వీడియో చూసిన ప్రతి ఒక్కరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్న ఈ ఆసక్తికర దృశ్యం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది. చివరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సైతం ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో దీనికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. సామాన్యులకు విమాన ప్రయాణం మరింత చేరువవుతోందనడానికి ఈ దృశ్యమే నిదర్శనమంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.