Viral Video: అర్థరాత్రి చెల్లిని భయంగా క్యాబ్ ఎక్కించిన యువకుడు.. క్యాబ్ డ్రైవర్ చెప్పిన మాటతో!
Viral Video: అర్ధరాత్రి పూట ఒంటరిగా క్యాబ్‌లో ప్రయాణించే మహిళల భద్రతపై కుటుంబ సభ్యులకు ఆందోళన ఉండటం సహజం.
Viral Video: అర్థరాత్రి చెల్లిని భయంగా క్యాబ్ ఎక్కించిన యువకుడు.. క్యాబ్ డ్రైవర్ చెప్పిన మాటతో!
Viral Video: మహిళలు అర్ధరాత్రి పూట ఒంటరిగా ప్రయాణించాలంటే కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొనడం సర్వసాధారణం. ప్రతిరోజూ మనం వింటున్న క్రైమ్ వార్తల నేపథ్యంలో ఈ భయం మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే సమాజంలో ఇంకా మంచివాళ్లు ఉన్నారని నిరూపించే ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అర్ధరాత్రి పూట తన క్యాబ్ ఎక్కిన యువతి సోదరుడికి ఓ క్యాబ్ డ్రైవర్ చెప్పిన మాటలు ఇప్పుడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఒక యువతి రాత్రి సమయంలో ఢిల్లీ నుంచి గుర్గావ్ వెళ్లేందుకు ఒక క్యాబ్ బుక్ చేసుకుంది. ఆమెను క్యాబ్ వద్దకు వదిలిపెట్టడానికి వచ్చిన ఆమె సోదరుడు భద్రత దృష్ట్యా ఆందోళన చెందుతూ.. ప్రయాణమంతా తనకు ఫోన్లో అప్‌డేట్స్ ఇస్తూ ఉండాలని చెల్లికి పదేపదే చెబుతున్నాడు. వారి మధ్య జరుగుతున్న ఈ సంభాషణను గమనించిన ఆ క్యాబ్ డ్రైవర్ కల్పించుకుని ఎంతో భరోసానిచ్చే మాటలు మాట్లాడాడు.
"నా కారు బయట నా నంబర్, నా అడ్రస్ రాసి ఉన్నాయి. ఒక ఫోటో తీసుకోండి. ఆమె నాకు కూడా చెల్లెలు లాంటిదే. టెన్షన్ పడకండి. ఇది మీ సొంత సోదరుడి క్యాబ్ అనుకుని ప్రశాంతంగా కూర్చోండి. నా చిన్న చెల్లెలిలాగా ఆమెను సురక్షితంగా తీసుకెళ్తాను" అని ఆ క్యాబ్ డ్రైవర్ సోదరుడికి మాట ఇచ్చాడు. డ్రైవర్ మాటలకు ఆ యువతి "కుటుంబం అన్నాక ఆందోళన ఉంటుంది, థాంక్యూ భయ్యా" అని బదులిచ్చింది.
లక్షయ్ మెహతా అనే యూజర్ ఈ వీడియోను 'ఎక్స్' వేదికగా షేర్ చేయడంతో అది కాస్తా విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ క్యాబ్ డ్రైవర్ చూపించిన ఆత్మీయత, బాధ్యతను చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి చిన్న భరోసా ఇచ్చే మాటలు, ఒంటరిగా ప్రయాణించే వారి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని కామెంట్లు పెడుతున్నారు. నిజంగా ఆ డ్రైవర్ తన సంభాషణతో ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచాడు.




