Viral Video: బైకులపై సింహాన్ని వెంబడించిన అటవీ సిబ్బంది.. వీడియో వైరల్, చివరికి ఏమైందంటే?
Viral Video: గుజరాత్‌లోని అంబార్డీ సఫారీ పార్క్‌లో ఓ సింహాన్ని ముగ్గురు వ్యక్తులు బైకులపై వెంబడిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: బైకులపై సింహాన్ని వెంబడించిన అటవీ సిబ్బంది.. వీడియో వైరల్, చివరికి ఏమైందంటే?
Viral Video: గుజరాత్‌లోని ఓ సఫారీ పార్క్‌లో సింహాన్ని బైకులపై వెంబడిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిళ్లపై ఓ భారీ సింహాన్ని తరుముతుండగా, అది వారి నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని ధారి ప్రాంతంలో ఉన్న అంబార్డీ సఫారీ పార్క్ లో దీపావళి వేళ ఈ ఘటన చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
దీపావళి సెలవుల కారణంగా ఆ రోజు సఫారీ పార్క్ పర్యాటకులతో రద్దీగా ఉంది. సరిగ్గా అదే సమయంలో పార్క్‌లోని ఎన్‌క్లోజర్ నుంచి ‘సింబా’ అనే భారీ సింహం తప్పించుకుని బయటకు వచ్చింది. పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు, ఆ సింహాన్ని తిరిగి ఎన్‌క్లోజర్‌లోకి పంపించేందుకు కొందరు అటవీశాఖ సిబ్బంది మోటార్ సైకిళ్లపై దాని వెంటపడ్డారు. సింహం వారి బారి నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ పరుగులు తీసింది. చివరకు సిబ్బంది దానిని సురక్షితంగా ఎన్‌క్లోజర్‌లోకి తరలించారు.
జంతుప్రేమికుల ఆగ్రహం.. అటవీశాఖ వివరణ
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వన్యప్రాణిని వేధిస్తున్నారంటూ జంతుప్రేమికులు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై ఇన్‌ఛార్జి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ACF) మితేశ్ వనియా స్పందిస్తూ సింహాన్ని వేధించారన్న వాదనను తోసిపుచ్చారు.
అధికారి వివరణ: ‘‘ఈ పార్క్ మొత్తం 300 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇందులో ‘క్రాల్’ అనే 100x100 మీటర్ల ప్రదేశంలో ప్రతిరోజూ సాయంత్రం వన్యప్రాణులకు ఆహారం పెడతాం. ఆ రోజు సింబా అనే సింహం ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లిపోవడంతో దానిని తిరిగి ఎన్‌క్లోజర్ వైపు పంపించేందుకు సిబ్బంది ప్రయత్నించారు’’ అని ఆయన వివరించారు.
నిబంధనలు ఉల్లంఘించిన సిబ్బందిపై వేటు
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో అటవీ సిబ్బంది జీపులను ఉపయోగిస్తుంటారు. కానీ, ఆ రోజు సిబ్బంది బైకులను వినియోగించడమే కాకుండా, ఆ వ్యవహారం మొత్తాన్ని వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి, వీడియో వైరల్ చేసినందుకు సదరు అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని అటవీశాఖ అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు.




