Viral Video: రూ.2 కే పూలు, రూ.5 కే కూరగాయలు.. 50 ఏళ్ల క్రితం పెళ్లి ఖర్చులు ఎలా ఉండేవంటే!
Viral Video: 1975 నాటి ఒక పెళ్లి ఖర్చుల చిట్టా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: రూ.2 కే పూలు, రూ.5 కే కూరగాయలు.. 50 ఏళ్ల క్రితం పెళ్లి ఖర్చులు ఎలా ఉండేవంటే!
Viral Video: ప్రస్తుత కాలంలో పెళ్లి అంటే లక్షల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేసే భారీ వేడుకగా మారిపోయింది. ఫంక్షన్ హాల్, కేటరింగ్, డెకరేషన్, కాస్ట్యూమ్స్ అంటూ ప్రతీదానికి వేలల్లో ఖర్చవుతోంది. కానీ, కొన్నేళ్ల కిందట పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. సరిగ్గా 1975 నాటి ఒక పెళ్లి ఖర్చుల చిట్టాకు సంబంధించిన పాత పత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బామ్మ చదువుతున్న పాత లెక్కల చిట్టా..
1975 జూలై 9వ తేదీన (9/7/1975) రాసి ఉన్న ఓ వివాహ ఖర్చుల కాగితాన్ని ఒక బామ్మ ఎంతో ఆప్యాయంగా చదువుతూ వివరిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది. ఆనాడు ప్రతీ చిన్న ఖర్చును ఎంత శ్రద్ధగా, పక్కాగా కాగితంపై నమోదు చేసేవారో ఆ చిట్టా చూస్తే అర్థమవుతుంది. అప్పట్లోని ధరలు ఎలా ఉండేవో ఆ బామ్మ చెబుతున్న లెక్కలు చూసి నేటి తరం తెగ ఆశ్చర్యపోతోంది.
ఆనాడు ఏ ఖర్చు ఎంతంటే..?
బామ్మ వివరించిన ఆ లెక్కల ప్రకారం.. అప్పట్లో పెళ్లి కట్నంగా రూ. 200 ఇచ్చినట్లు ఉంది. ఇక ఆడపడుచు కట్నం కింద మరో రూ. 58 ఖర్చు చేశారు. పెళ్లి బట్టల కోసం రెండుసార్లుగా రూ. 117, రూ. 167 చొప్పున మొత్తం రూ. 284 వెచ్చించారు. మంగళసూత్రం, బటువు కోసం రూ. 30, ఇతర నిత్యావసర సరుకుల కోసం రూ. 150 కేటాయించారు.
కూరగాయలు రూ. 5.. పూలు రూ. 2!
ఇక తినుబండారాలు, పూలు, కూరగాయల ధరలైతే నేటి తరానికి మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా కూరగాయల కోసం కేవలం రూ. 5 మాత్రమే ఖర్చు చేయగా.. పూలకు రూ. 2, మిఠాయిలకు కూడా రూ. 2 మాత్రమే వెచ్చించారు. అలాగే అరటి గెలకు రూ. 10, ప్రయాణం కోసం రిక్షాలకు రూ. 4.50, మైక్ సెట్ కోసం రూ. 10 చెల్లించినట్లు ఆ చిట్టాలో స్పష్టంగా రాసి ఉంది.
అంతేకాకుండా, పెళ్లికూతురు కాళ్ల గోళ్లు తీసే వ్యక్తికి రూ. 12, చాకలికి రూ. 2, బ్రాహ్మణుడికి రూ. 5 చొప్పున పారితోషికం ఇచ్చినట్లు ఆ పత్రం చెబుతోంది. ప్రథానం సామాన్లకు రూ. 14, కార్యం జరిగిన రోజు రాత్రి ఖర్చుల కోసం మరో రూ. 5 వెచ్చించారు.
కాలంతో పాటు మారిన జీవన విధానం..
నేటి ధరలతో పోలిస్తే అప్పట్లో ఆ మొత్తాలు కూడా ఆనాడు పెద్దవే అయినప్పటికీ.. కేవలం కొన్ని రూపాయలతో పెళ్లి తంతు ముగియడం విశేషం. కాలం మారుతున్న కొద్దీ జీవన విధానం, వస్తువుల విలువ, వివాహాల నిర్వహణ పద్ధతులు ఎంతలా మారిపోయాయో ఈ పాత పెళ్లి చిట్టా కళ్లకు కడుతోంది. పాత తరం జ్ఞాపకాలను గుర్తుచేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.




