Viral Video: మంచు అమ్మ మంచు.. కరెంటు కష్టాల ఎఫెక్ట్.. అఫ్గాన్ లో కిలోల లెక్కన మంచు గడ్డల అమ్మకం

Viral Video: అఫ్గానిస్థాన్‌లో కరెంటు సమస్య కారణంగా కొండల నుంచి తెచ్చిన సహజ సిద్ధమైన మంచును రోడ్లపై అమ్ముతున్నారు. ఈ వింత వ్యాపారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

CR Reddy
Published on: 16 March 2026 7:29 AM IST
Afghanistan Viral Video
X

 Afghanistan Viral Video

Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా క్షణాల్లో మన కళ్లముందుకు వచ్చేస్తోంది. తాజాగా అఫ్గానిస్థాన్‌కు చెందిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా మనం షాపుల్లో ఐస్ ముక్కలు లేదా ఐస్ క్యూబ్స్ కొనడం చూస్తుంటాం. కానీ, అక్కడ ఏకంగా కొండల నుంచి తెచ్చిన సహజసిద్ధమైన మంచును (Snow) రోడ్ల మీద పెట్టి అమ్ముతున్నారు. ఈ వింత వ్యాపారాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఫ్రిజ్‌లు, కోల్డ్ స్టోరేజీలు ఉన్న ఈ కాలంలో ఇలా మంచును ఎందుకు అమ్ముతున్నారో అని అంతా ఆరా తీస్తున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక చిన్న ట్రక్కు నిండా తెల్లటి మంచు నిండి ఉంది. ఒక వ్యక్తి ఆ మంచును ప్లాస్టిక్ కవర్లలో నింపి రోడ్డు పక్కన ఉన్న జనాలకు అమ్ముతున్నాడు. ఈ మంచును అఫ్గానిస్థాన్‌లోని ఎత్తైన హిందూకుష్ పర్వత శ్రేణుల నుంచి తెస్తున్నట్లు సమాచారం. అక్కడి మంచు గడ్డలను నరికి, ట్రక్కుల్లో నింపి మైదాన ప్రాంతాలకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో మంచు ఉచితంగా దొరికినా, దాన్ని తరలించి తీసుకురావడమే ఇక్కడ అసలైన కష్టం. అదే అక్కడ ఒక వ్యాపారంగా మారిపోయింది.

అఫ్గానిస్థాన్‌లో ఇలా ఎందుకు అమ్ముతున్నారనే దానికి ఒక ప్రధాన కారణం ఉంది. అక్కడ చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరా సరిగ్గా ఉండదు. దీనివల్ల సామాన్యుల ఇళ్లలో ఫ్రిజ్‌లు ఉన్నా అవి పనిచేయవు, చాలా మందికి ఫ్రిజ్‌లు కొనే స్తోమత కూడా ఉండదు. వేసవిలో ఎండలు మండిపోతున్నప్పుడు తాగే నీరు చల్లగా ఉండాలన్నా, కూరగాయలు పాడవకుండా ఉండాలన్నా ఇలా కొండల నుంచి తెచ్చిన మంచుపైనే వారు ఆధారపడుతున్నారు. ఈ మంచు గడ్డలను తీసుకెళ్లి నీళ్ల బకెట్లలో వేసుకుని చల్లటి నీటిని తయారు చేసుకుంటారు.

ఈ వీడియోను ఎక్స్ (ట్విట్టర్)లో '@sciencegirl' అనే ఐడి నుంచి షేర్ చేయగా, లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "అఫ్గాన్ ప్రజలు కష్టాల్లో కూడా ఎలా బతకాలో తెలిసిన వారు" అని ఒకరు కామెంట్ చేయగా.. "అసలు ఆ మంచును ఎలా తింటారు? అది శుభ్రంగానే ఉంటుందా?" అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, టెక్నాలజీ ప్రపంచానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో మనుషులు తమ అవసరాల కోసం ఎంతలా కష్టపడతారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

CR Reddy

CR Reddy

Next Story