Viral Video: ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా రూ. 1 లక్ష నగదు.. ఆనందంతో కంటతడి పెట్టిన సిబ్బంది!

Viral Video: సూరత్ వస్త్ర వ్యాపారి రామ్‌స్వరూప్ ముండే 20 మంది ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా రూ.లక్షకు పైగా నగదు అందించి ప్రశంసలు అందుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Nov 2026 1:56 AM IST
Viral Video: ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా రూ. 1 లక్ష నగదు.. ఆనందంతో కంటతడి పెట్టిన సిబ్బంది!
X

Viral Video: దీపావళి పండుగను పురస్కరించుకుని గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వస్త్ర వ్యాపారి తన ఉద్యోగులకు భారీ బోనస్ అందించి వార్తల్లో నిలిచారు. తన వద్ద పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి రూ.లక్షకు పైగా నగదును దీపావళి కానుకగా అందించారు. ఈ అనూహ్య బహుమతిని అందుకున్న ఉద్యోగులు ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. ఓ మహిళా ఉద్యోగి ఆనందబాష్పాలు పెట్టుకోవడం అందరినీ కదిలించింది.


20 మంది ఉద్యోగులకు భారీ దీపావళి బోనస్


సూరత్‌లో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్న రామ్‌స్వరూప్ ముండే తన వద్ద పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు ఈ ప్రత్యేక బోనస్‌ను అందించారు. సాధారణంగా పండుగల సమయంలో ఇచ్చే మిఠాయిలు, ఇతర బహుమతులకు భిన్నంగా ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా నగదును కొత్త కరెన్సీ నోట్ల రూపంలో అందజేశారు.

రూ.10 నుంచి రూ.500 వరకు వివిధ విలువల నోట్లను వెండి రంగు పళ్లెంలో అందంగా అమర్చి ఉద్యోగులకు అందించారు. ఈ నగదును చూసిన ఉద్యోగులు తొలుత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత బోనస్ అందుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యాపారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.


పేదరికం నుంచి వచ్చిన అనుభవంతోనే ఈ నిర్ణయం


'ఇండియా టుడే'కు చెందిన 'ఆజ్ తక్' ఛానెల్‌తో ఫోన్‌లో మాట్లాడిన రామ్‌స్వరూప్ ముండే తన నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని వివరించారు. తాను పేదరికంలో పెరిగానని, పండుగల సమయంలో కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు తనకు తెలుసని చెప్పారు.

తన వద్ద పనిచేసే ఉద్యోగులను కేవలం సిబ్బందిగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావిస్తానని పేర్కొన్నారు. ఏడాది పొడవునా వారు చూపిన కష్టపడే తత్వం, అంకితభావమే తన వ్యాపార అభివృద్ధికి ముఖ్య కారణమని తెలిపారు.


ఉద్యోగుల కుటుంబాల్లో దీపావళి ఆనందం నింపాలనే ఉద్దేశం


తన ఉద్యోగులు తమ కుటుంబాలకు అవసరమైన పండుగ కొనుగోళ్లు చేసుకుని, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా దీపావళి జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ బోనస్ ఇచ్చినట్లు ముండే వెల్లడించారు. ఖర్చు గురించి ఆలోచించకుండా ప్రతి ఒక్కరికీ రూ.లక్షకు పైగా నగదు అందించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

ఈ నగదు పంపిణీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉద్యోగుల పట్ల వ్యాపారి చూపిన ఆప్యాయత, ఉదారతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్