రైలులో వేధించిన వ్యక్తికి యువతి వింత శిక్ష.. గాజులు తొడిగి, లిప్‌స్టిక్ పూసి అవమానం..!

Viral Video: మహారాష్ట్ర ప్యాసింజర్ రైలులో తనను వేధించిన వ్యక్తికి ఓ యువతి వినూత్నంగా లిప్‌స్టిక్ పూసి, గాజులు తొడిగి శిక్షించింది.

Naresh.k
Published on: 19 July 2026 2:31 PM IST
Viral Video
X

రైలులో వేధించిన వ్యక్తికి యువతి వింత శిక్ష.. గాజులు తొడిగి, లిప్‌స్టిక్ పూసి అవమానం..!

Lipstick Punishment: రైళ్లలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారికి సాధారణంగా పోలీసులు బుద్ధి చెప్పడం లేదా జనాలు దేహశుద్ధి చేయడం మనం చూస్తుంటాం. కానీ మహారాష్ట్రలో ఒక యువతి.. తనను వేధించిన వ్యక్తని కొట్టకుండా, తిట్టకుండా ఊహించని విధంగా ఒక వింత శిక్ష వేసింది. తోటి ప్రయాణికుల సాయంతో ఆ వ్యక్తికి గాజులు తొడిగి, పెదాలకు లిప్‌స్టిక్ పూసి అందరి ముందు అవమానించింది. జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలోని భూసావళ్–వర్ధా ప్యాసింజర్ రైలులో ఈ విచిత్ర సంఘటన జరిగింది. రైలులో ప్రయాణిస్తున్న ఒక యువతి పట్ల తోటి ప్రయాణికుడు ఒకడు అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వచ్చాయి.

సాధారణంగా ఇలాంటి సమయాల్లో అమ్మాయిలు భయపడటమో లేదా గొడవ పడటమో చేస్తారు. కానీ ఈ యువతి రూట్ మార్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె, తోటి ప్రయాణికుల సాయంతో సదరు యువకుడిని నిలదీసి పట్టుకుంది. అనంతరం అతనికి బుద్ధి చెప్పడానికి ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. తన బ్యాగులో ఉన్న మేకప్ సామాగ్రి బయటకు తీసి.. ప్రయాణికులంతా చూస్తుండగానే అతని చేతులకు గాజులు తొడిగింది. అంతటితో ఆగకుండా పెదాలకు లిప్‌స్టిక్, ముఖానికి మేకప్ వేసి బహిరంగంగా శిక్షించింది. ఈ ఊహించని పరిణామానికి షాక్ తిన్న ఆ యువకుడు, ఏమీ చేయలేక రైలు సీట్లో మౌనంగా కూర్చుండిపోవడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది.

ఈ వీడియో కాస్తా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌ వేదికలపై ప్రత్యక్షమవడంతో నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ప్రధానంగా రెండు రకాల భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. మహిళలపై జరుగుతున్న వేధింపులను మౌనంగా భరించకుండా యువతి ధైర్యంగా ఎదిరించడాన్ని పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు. ముఖ్యంగా ఆ సమయంలో తోటి ప్రయాణికులు కూడా ఆమెకు అండగా నిలబడటం గొప్ప విషయమని, సమాజంలో వేధింపులకు పాల్పడే వారికి ఇదొక బలమైన సందేశాన్ని ఇస్తుందని ఒక వర్గం గట్టిగా సమర్థిస్తోంది.

మరోవైపు, కొందరు నెటిజన్లు ఈ చర్యను తీవ్రంగా తప్పుబడుతున్నారు. అసలు నేరం ఏంటనేది చట్టపరంగా రుజువు కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఇలా బహిరంగంగా ఒక వ్యక్తిని అవమానించే హక్కు ఎవరికీ లేదని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా వీడియో తీస్తున్న సమయంలో అక్కడ ఉన్న కొందరు మహిళలు దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం గురించి మాట్లాడుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. కేవలం సోషల్ మీడియాలో లైకులు, అటెన్షన్ కోసమే కనీస విచారణ లేకుండా ఒక వ్యక్తిని ఇలా బలిపశువును చేశారంటూ కొందరు మండిపడుతున్నారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story