Viral News : వెస్ట్ బెంగాల్ టూరిజం యాడ్‌లో విదేశాలేంటి? నెటిజన్ల ట్రోల్స్

పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ టూరిజం హబ్‌గా ప్రపంచానికి పరిచయం చేయడానికి అక్కడ కొత్తగా రూపొందించిన ఒక టూరిజం అడ్వర్టైజ్‌మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో

G Krishna
Published on: 5 Sept 2026 4:24 PM IST
West Bengal
X

West Bengal 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ టూరిజం హబ్‌గా ప్రపంచానికి పరిచయం చేయడానికి అక్కడ కొత్తగా రూపొందించిన ఒక టూరిజం అడ్వర్టైజ్‌మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. బెంగాల్ అందాలను, అక్కడి సంస్కృతిని చూపించాల్సిన ఈ ప్రోమో యాడ్‌లో విదేశీ పర్యాటక ప్రాంతాలను ఎక్కువగా చూపించడంతో నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు , పర్యాటక ప్రియులు ఈ వీడియోపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఒక రాష్ట్ర పర్యాటకాన్ని ప్రమోట్ చేసే క్రమంలో ఇలాంటి పొరపాటు జరగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

యాడ్‌లో ఈఫిల్ టవర్, ఈజిప్ట్ పిరమిడ్లు

ఈ ప్రచార వీడియోలో బెంగాల్‌కు చెందిన హౌరా బ్రిడ్జ్ కేవలం కొద్ది సెకన్ల పాటు మాత్రమే మెరుపులా కనిపిస్తుంది. అది పూర్తయిన వెంటనే పారిస్‌లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్, రష్యాలోని సెయింట్ బాసిల్స్ కేథడ్రల్, ఈజిప్ట్ పిరమిడ్లు, అలాగే బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో ఉన్న క్రైస్ట్ ది రెడీమర్ విగ్రహం వంటి విదేశీ పర్యాటక ప్రాంతాలే ఎక్కువగా దర్శనమిస్తాయి. ఇది చూసిన ప్రయాణికులు , నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు బెంగాల్ టూరిజం యాడ్‌లో "బెంగాల్ ఎక్కడ ఉంది?" అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మీమ్స్, కామెంట్లతో కడిగిపారేస్తున్నారు.

రూ. 500 కోట్ల పెట్టుబడి.. కొత్త బ్రాండ్ లోగో

ధన ధాన్య ఆడిటోరియంలో అత్యంత వైభవంగా నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి కొత్త టూరిజం లోగో , బ్రాండ్ ఐడెంటిటీని లాంచ్ చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచేందుకు రూ. 500 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. సుందర్‌బన్స్ మడ అడవుల నుంచి డార్జిలింగ్, కాలింపాంగ్ కొండల వరకు బెంగాల్‌లో ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయని తెలిపారు. గతంలో తమ రాష్ట్రంలో టూరిజం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినిందని, పర్యాటకులు డార్జిలింగ్ దాటుకుని పొరుగున ఉన్న సిక్కిం వైపు వెళ్లిపోతున్నారని, ఈ పరిస్థితిని మార్చి రాష్ట్ర పర్యాటకాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లడానికే ఈ కొత్త క్యాంపెయిన్ తెచ్చామని వివరించారు.

బెంగాల్ ఐకానిక్ ప్రదేశాలు ఏవి?

ఈ వీడియోలో బెంగాల్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన విక్టోరియా మెమోరియల్, బిష్ణుపూర్ టెర్రకోట ఆలయాలు, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే వంటి ఐకానిక్ స్పాట్‌లను చూపించకపోవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 'వెస్ట్ బెంగాల్: వేర్ ఇండియా ఫీల్స్ డిఫరెంట్' అనే కొత్త టాగ్ లైన్‌తో, పాత 'బిశ్వ బంగ్లా' బ్రాండింగ్ స్థానంలో ఈ కొత్త ప్రచారాన్ని డిజైన్ చేశారు. అయితే విదేశీ లొకేషన్లను ప్రమోట్ చేయడం వల్ల ఈ టాగ్ లైన్ ఉద్దేశమే దెబ్బతిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రాజకీయ నాయకుల ఘాటు విమర్శలు

ఈ యాడ్ వివాదంపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ డెరెక్ ఓబ్రియన్ తీవ్రంగా స్పందిస్తూ.. ఈ కమ్యూనికేషన్ వీడియో కేవలం ఒక చెత్త అని అభివర్ణించారు. మాజీ గవర్నర్ తథాగత రాయ్ మాట్లాడుతూ.. "వెస్ట్ బెంగాల్ టూరిజం ప్రోమో వీడియోలో మాస్కో, ఈజిప్ట్, రియో డి జెనీరో దృశ్యాలు చూపించడం ఏంటి? ఇది చాలా స్టూపిడ్ , అమాయకపు ప్రమోషన్" అని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ అడ్వర్టైజ్‌మెంట్‌ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అలాగే పొలిటికల్ ఎనలిస్ట్ మయూఖ్ రంజన్ ఘోష్ కూడా స్పందిస్తూ, బెంగాల్‌లో సముద్రాలు, కొండలు, అడవులు , అందమైన నగరాలు ఉన్నప్పుడు విదేశీ ప్రాంతాలకు ఉచితంగా పబ్లిసిటీ ఇవ్వడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలు తమ సంస్కృతిని ఎలా ప్రమోట్ చేసుకుంటున్నాయో చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story