Legal: తప్పుడు కేసులో ఇరుక్కున్నవారు.. ఇలా చేస్తే వెంటనే బయటకు రావచ్చు
Legal: మీపై ఎవరైనా కావాలని తప్పుడు పోలీసు కేసు(FIR) పెట్టారా? భయపడాల్సిన అవసరం లేదు.
Legal: తప్పుడు కేసులో ఇరుక్కున్నవారు.. ఇలా చేస్తే వెంటనే బయటకు రావచ్చు
Legal: సమాజంలో మనకు గిట్టని వారు లేదా పాత కక్షలు ఉన్నవారు ఒక్కోసారి మనపై తప్పుడు కేసులు బనాయిస్తుంటారు. పోలీసులకి తప్పుడు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్(FIR) నమోదు అయ్యేలా చేస్తారు. ముఖ్యంగా ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు(కట్నం వేధింపులు), లేదా రాజకీయ కక్షల నేపథ్యంలో ఇలాంటి దొంగ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. ఒకవేళ మీపై ఇలాంటి ఫేక్ ఎఫ్ఐఆర్ నమోదైతే కంగారు పడిపోయి, భయంతో దాక్కోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి తప్పుడు కేసుల నుంచి అమాయకులను రక్షించడానికి భారతీయ చట్టంలో 'క్వాష్ పిటిషన్' అనే ఆయుధం ఉంది. దీని గురించి ప్రముఖ న్యాయవాది కీలక విషయాలు పంచుకున్నారు.
క్వాష్ పిటిషన్ అంటే ఏమిటి?
ఎవరైనా మీపై ఉద్దేశపూర్వకంగా, ఎలాంటి సరైన మెరిట్ లేదా ఆధారాలు లేకుండా తప్పుడు ఫిర్యాదు చేస్తే, ఆ ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయమని కోరుతూ నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చు. దీనినే 'క్వాష్ పిటిషన్' అంటారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 482 ప్రకారం ఈ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సెక్షన్ ప్రకారం కోర్టులకు అత్యున్నత అధికారాలు ఉంటాయి.
క్వాష్ పిటిషన్ ఎలా వేయాలి? ఎప్పుడు వేయాలి?
మీపై ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలియగానే ఒక మంచి క్రిమినల్ లాయర్‌ను సంప్రదించాలి. ఆ ఎఫ్ఐఆర్ కాపీని తీసుకుని, అందులో మీపై చేసిన ఆరోపణలు ఎలా అవాస్తవమో, ఆ కేసులో ప్రాథమిక ఆధారాలు ఏవీ లేవని వివరిస్తూ సెక్షన్ 482 కింద క్వాష్ పిటిషన్ వేయాలి. ఉదాహరణకు, ఎఫ్ఐఆర్‌లో చెప్పిన సమయానికి మీరు ఆ ప్రదేశంలో లేరని నిరూపించే ఆధారాలు, లేదా అది సివిల్ వివాదం అయినప్పటికీ కావాలని క్రిమినల్ కేసుగా మార్చారని నిరూపించే డాక్యుమెంట్లు ఉంటే వాటిని కోర్టుకు సమర్పించాలి.
పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. ఆ కేసు కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగా పెట్టారని, లేదా అందులో ఎలాంటి చట్టపరమైన మెరిట్ లేదని భావిస్తే, వెంటనే ఆ ఎఫ్ఐఆర్‌ను పూర్తిగా కొట్టివేస్తుంది. ఒకసారి కోర్టు క్వాష్ ఆర్డర్ ఇచ్చిందంటే, ఆ కేసు అక్కడితో ముగిసిపోయినట్లే. ఇక పోలీసులు ఆ కేసు విషయంలో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి లేదా విచారించడానికి ఎలాంటి అధికారం ఉండదు. చట్టం ఎల్లప్పుడూ న్యాయం వైపే ఉంటుంది కాబట్టి, తప్పుడు కేసులకు ఎప్పుడూ భయపడకండి.




